జనవరి 23న పోలమాంబ జాతర

Dec 16,2023 20:59

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  :  శంబర పొలమాంబ జాతర మహౌత్సవాలు రాష్ట్ర ఉత్సవంగా వచ్చే జనవరి 22,23,24 తేదీల్లో నిర్వహిస్తున్న ట్టు ఆర్‌డిఒ కె.హేమలత తెలిపారు. మక్కువ మండలం శంబర జాతరపై శనివారం ఆర్‌డిఒ తన కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జాతర ప్రశాంతంగా సజావుగా జరగాలన్నారు. జాతరకు వచ్చే ప్రతి యాత్రికులు పూర్తి సంతృప్తితో తిరిగి వెళ్లాలని, అందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని కోరారు. గత అనుభవాల దృష్ట్యా లోపాలను సవరించుకుంటూ విజయవంతంగా చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పోలీస్‌ బందోబస్తు తగినంత ఏర్పాటు చేసి, ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని పోలీస్‌ శాఖను కోరారు. తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులూ ఉండరాదన్నారు. మరుగుదొడ్లు సిద్ధం చేయాలన్నారు. పారిశుధ్యం పక్కాగా ఉండాలని, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల నుంచి కార్మికులు, వాహనాలను పంపించాలన్నారు. జాతర అనంతరం గ్రామంలో పూర్తి పారుశుధ్యం నెలకొనాలని స్పష్టం చేశారు. అమ్మవారి మారు జాతర ముగిసే మార్చి వరకు ప్రతి మంగళవారం పారిశుధ్యంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. పార్కింగ్‌ స్థలాలు, వాటికి ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలు పక్కాగా ఉండాలని, స్వచ్ఛంద కార్యకర్తలు ఉండాలని ఆమె పేర్కొన్నారు. అంబులెన్సులు వెళ్లేందుకు రహదారి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఫీడర్‌ అంబులెన్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతర విద్యుత్‌ సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రతి రహదారి మలుపు (కర్వ్‌) వద్ద విద్యుత్‌ కాంతులు ఉండాలన్నారు. వనం గుడి వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరిచేయాలన్నారు. అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ప్రజలకు సమాచారం ఇచ్చుటకు, మైక్‌ ల ద్వారా ప్రకటించుటకు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఏర్పాటు చేయాలని అన్నారు. రవాణాకు ఎటువంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని రహదారులు భవనాలు శాఖను సూచించారు. తగిన బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజా రవాణా శాఖను సూచించారు. ప్రసాదం తయారీలో పరిశుభ్రత విధిగా పాటించాలని – ఎటువంటి కల్తీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి డివివి ప్రసాదరావు జాతర తేదీలను వివరించారు. ఈనెల 18న పెద్దమ్మ వారి చాటింపుతో ప్రారంభమై 2024 మార్చి 26 జరిగే చండి హౌమం, మహాన్నదానంతో ఉత్సవాలు ముగుస్తా యన్నారు. జనవరి 22న తొలేళ్లు, 23న సిరిమానోత్సవం, 24న అనుపోత్సవం జరుగుతాయని చెప్పారు. జనవరి 30 నుండి మార్చి 26వరకు మారు జాతర పది వారాలు జరుగుతాయని వివరించారు. డీఎస్పీ జి.మురళీధర్‌ మాట్లాడుతూ 4గురు డీఎస్పీలు, 12 మంది సిఐలు, 38 మంది ఎస్‌ఐలతో సహా మందిని గత ఏడాది బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జిల్లా విపత్తు స్పందన అధికారి కె శ్రీనివాస బాబు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారి ఓ ప్రభాకరరావు, ప్రజా రవాణా డిపో మేనేజర్‌ ఇకెకె దుర్గ, వైద్య శాఖ ప్రోగ్రాం అధికారి డా ఎం వినోద్‌, సాలూరు తహశీల్దార్‌ ఆర్‌.బాలమురళి, మక్కువ ఎంపిడిఒ పి.దేవకుమార్‌, పొలమాంబ దేవాలయ ఇఒ వివి నారాయణ, దేవస్థానం మాజీ చైర్మన్‌ పూడి దాలినాయుడు, ఎంపిటిసి తీళ్ల పోలినాయుడు, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️