జిందాల్‌ భూనిర్వాసితుల నిరసన దీక్ష

Feb 21,2024 20:58

ప్రజాశక్తి-శృంగవరపుకోట  : తమకు న్యాయంగా రావాల్సిన బకాయిలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ, జిందాల్‌ అల్యూమినా కంపెనీ భూ నిర్వాసితులు చేస్తున్న నిరసన బుధవారానికి రెండవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008లో జిందాల్‌ అల్యూమినా కర్మాగారం ఏర్పాటు చేస్తామంటే తమ భూములు అప్పట్లో గల ధరకు ఇచ్చామని, పరిశ్రమ ఏర్పాటు కాకముందే కంపెనీలో షేర్ల ద్వారా భాగస్వాములు చేస్తామని కంపెనీ నమ్మించిందని తెలిపారు. 16ఏళ్లు గడిచినా ఎటువంటి పరిశ్రమ రాని కారణంగా భూములు ఇచ్చిన పేద గిరిజనులైన తమ బతుకులు అధ్వాన్నంగా తయారై రోడ్డునపడ్డామని వాపోయారు. తమ నుంచి సేకరించిన భూముల్లో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, పారిశ్రామిక వాడలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని గానీ, భూములు కోల్పోయిన తమకు ఏ విధముగా భరోసా కల్పించి ఆదుకుంటారో గాని ఇప్పటివరకు కంపెనీ ప్రకటించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. అప్పట్లో భూముల విలువలో కొంత మొత్తానికి బదులు ఇచ్చిన షేర్ల ధరలను ఇప్పటి విలువ ప్రకారం మదింపు చేసి షేర్లు జారీచేసి కంపెనీలో తమకు భాగస్వామ్యం కల్పించాలని, పారిశ్రామికవాడ ఏర్పాటు చేసినపుడు తమకు ఏ విధమైన న్యాయం చేస్తారో చెప్పాలని కోరారు. దీక్షా శిబిరాన్ని ఎస్‌.కోట ఎంపిపి సండి సోమేశ్వరరావు, చుట్టుప్రక్కల గిరిజన పంచాయతీలకు చెందిన పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు సందర్శించి, సంఘీభావం తెలిపారు.

➡️