జిఎంసి నిర్లక్ష్యం వల్లే డయేరియా

Feb 11,2024 00:45

బాధితులతో మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు :
నగరంలో డయేరి యా వ్యాప్తికి నగర పాలక సంస్థ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సిపిఎం నగర కార్యదర్శి నళినీ కాంత్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌ విమర్శించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం, సిపిఐ బృందం పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్‌తో మాట్లాడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయేరియా వ్యాప్తితో సంగడిగుంట, శారదా కాలనీ, శ్రీనగర్‌, ముత్యాలరెడ్డి నగర్‌, సంగడిగుంట ఏరియాలతో పాటు నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి కలుషిత నీటి కారణంగా ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు. శారదా కాలనీకి చెందిన పద్మ అనే మహిళ చనిపోయిందని, కొద్దిమంది ఐసీయూలో ఉన్నారని తెలిపారు. గుంటూరు నగరంలో ఏ ప్రభుత్వం వచ్చినా పరిశుభ్రమైన తాగునీరు ప్రజలకు అందివ్వలేకపోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కలుషిత నీటి కారణంగా 12మంది చనిపోయారని, అయినా ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, ఫలితంగానే మళ్లీ ఇప్పుడు పునరావృతం అవుతుందన్నారు. గుంటూరు నగరంలో పెద్ద సంఖ్యలో డయేరియా బాధితులుగా ఆసుపత్రుల్లో చేరుతున్నా, బాధిత కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మంచినీళ్లు కలుషితం కాలేదని, నగరపాల సంస్థకి ఎలాంటి బాధ్యత లేదని నగర మేయర్‌, కమిషనర్‌ చెప్పడం సరికాదన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి వాదన చేస్తున్నారని, మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డయేరియా లక్షణాలున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నగరవాసులకు శుద్ధ జలాన్ని అందించేలా నగర పాలక సంస్థ సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. డయేరియా బాధితుల ఆరోగ్య స్థితిపై జిజిహెచ్‌ సూపరెండేట్‌ కిరణ్‌ కుమార్‌తో మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు ఖాసిం షహిద్‌, ఎస్‌.కార్తీక్‌, సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి నాయకులు అరుణ్‌,రమణ పాల్గొన్నారు.

➡️