జిఒ విడుదల చేయాలని మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి-కడప అర్బన్‌ డిశంబర్‌ 26 నుంచి జనవరి 10 వరకు నిర్వహించిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె కాలంలో ప్రభుత్వం ఒప్పుకున్న డిమాండ్లకు సంబంధించిన జిఒలు వెంటనే విడుదల చేయాలని కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందరంగా నగర కమిటీ అధ్యక్షులు సుంకర రవి, జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి కంచుపాటి తిరుపాలు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే జిఒ రూపాన విడుదల చేయాలన్నారు. డ్రైవర్లకు రూ. 24,500, పారిశుధ్య కార్మికులకు రూ. 21 వేలు క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18,500, కోవిడ్‌ -19 కార్మికులను అప్పోస్‌లో చేర్చడం ఇంజినీరింగ్‌ సెక్షన్‌లో వారికి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వడం వంటి హామీలు ఇచ్చి సమ్మెను విరమింప చేశారని, కానీ సమ్మె విరమించి దాదాపుగా నెల కావస్తున్నా ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి జీవోలు విడుదల కాలేదని తెలిపారు. జీవోలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఏ రోజైనా సమ్మెలోకి వెళ్తామని అందుకు కార్మికులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుంకర కిరణ్‌, ఆదామ్‌, సాయి, పెంచలయ్య, రొడ్డ ఆదాము దస్తగిరమ్మ లక్ష్మీదేవి పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని మున్సిపల్‌ కార్మిక సంఘ (సిఐటియు అనుబంధం) ప్రొద్దుటూరు శాఖ కార్యదర్శి సాల్మన్‌ కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మున్సిపల్‌ కార్యా లయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చల వల్ల గతంలో చేసిన సమ్మె విర మించామని గుర్తు చేశారు. విడుదల చేస్తామన్న రెండు జిఒలలో ఒకటి తమకు ప్రతికూలంగా ఉందన్నారు. కార్మికులకు తోపుడు బండ్లు, పనిముట్టు ఇవ్వాలని కోరారు. అనంతరం సహాయ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షులు చంటి, కోశాధికారి రాఘవేంద్ర, ప్రమీలమ్మ, నీతమ్మ, గుర్రమ్మ, మరియమ్మ, మోహన్‌, జాకోబు, గుర్రప్ప పాల్గొన్నారు.

➡️