జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: జేసి

Jan 31,2024 22:00

జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి: జేసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

రాష్ట్రంలో గల యువత క్రీడా స్ఫూర్తిని ప్రతిభను రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం.. ఆంధ్ర ఆటల పోటీల ద్వారా వెలికి తీస్తున్నదని చిత్తూరు నగర మేయర్‌ అముద పేర్కొన్నారు. బుధవారం చిత్తూరులోని మెసానికల్‌ గ్రౌండ్‌లో జిల్లాస్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నగర మేయర్‌ అముద, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రజల మానసిక ఉల్లాసాన్ని, శారీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. యువత తమ శారీరక దఢత్వాన్ని,పెంపొందించుటకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకొనుటకు ఆడుదాం ఆంధ్ర ఒక మంచి వేదిక అని తెలిపారు. జేసి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రలో గల క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, షటిల్‌ బాడ్మింటన్‌ వంటి 5 క్రీడలలో జిల్లా స్థాయి ఆటల పోటీలకు చేరుకున్న క్రీడాకారులకు చిత్తూరు జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలపాల్సిన బాధ్యత ఉందన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలన్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో క్రీడలలో మొదటి బహుమతిగా రూ.60 వేలు, రెండవ బహుమతిగా రూ.30 వేలు, మూడవ బహుమతిగా రూ.10 వేలు అందించడం జరుగుతుందని, బాడ్మింటన్‌ క్రీడలలో మొదటి బహుమతిగా రూ.35వేలు, రెండవ బహుమతిగా రూ.20 వేలు, మూడవ బహుమతిగా రూ.10 వేలు అందించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులకు భోజనం, తాగు నీరు వసతి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అంతర్జాతీయ స్థాయిలో స్కేటింగ్‌లో రాణించిన క్రీడాకారులు నితిన్‌, శ్రావణి, ఖోఖో లో జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు రాజ్‌ కుమార్‌, కబడ్డీలో జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారిణి గుల్జార్‌లను మేయర్‌, జేసి అభినందించారు. కార్యక్రమం ప్రారంభోత్సవ అనంతరం నియోజకవర్గాల వారీగా క్రీడాకారుల పరిచయ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జెడ్పి సిఈఓ ప్రభాకరరెడ్డి, నగర కమిషనర్‌ అరుణ, చిత్తూరు ఆర్డిఓ చిన్నయ్య, డిఎస్‌డిఓ బాలాజీ, డిఎల్‌డిఓ రవి కుమార్‌, నియోజకవర్గ నోడల్‌ అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

➡️