జిల్లాలో తగ్గిన నేరాలు : ఎస్‌పి

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ జిల్లా పరిధిలో నేరాలు, అసాంఘిక కార్యకలా పాలు గణనీయంగా తగ్గాయని ఎస్‌పి కృష్ణారావు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లాలో జరిగిన నేరాలు, కేసుల వివరాలు, పోలీస్‌ పనితీరు గురించి ఆయన మీడియాకు వెల్లడించారు. గత ఏడాదితో పోల్చుకుంటే 2023లో నేరాలు సంఖ్య తగ్గిందన్నారు. 2022లో 6079 కేసులు నమోదు కాగా, 2023లో 4920 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. గత ఏడాది హత్యలు సంబంధించిన కేసులు 35 నమోదు కాగా ఈ ఏడాది 44 నమోదైనట్లు తెలిపారు. ప్రజల జీవనానికి ఇబ్బందికరంగా మారిన 105 మంది పై రౌడీ షీట్స్‌ ఓపెన్‌ చేయగా, 4502 మందిని అధికారులు ఎదుట బైండ్‌ ఓవర్‌ చేసి కౌన్సెలింగ్‌ ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వలన పాత నేరస్తులను గుర్తించడం ఫింగర్‌ ప్రింట్స్‌ తీయడం వలన చాలా వరకు చోరీ కేసులను తగ్గించడం జరిగిందన్నారు. ఫోక్సో చట్టం కింద గత ఏడాది 46 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 37 కేసులు నమోద య్యాయన్నారు. ఈ ఏడాది సైబర్‌ నేరాలు పెరిగినప్పటికీ రికవరీ స్థాయి కూడా అధికంగా పెరిగిందని వివరించారు. ఎర్రచందనం అక్రమ రవాణా సంబంధించిన తొమ్మిది కేసులలో 30 మందిని అరెస్టు చేసి రూ.75 లక్షల 13,500 విలువ చేసే 63 ఎర్రచందనం దుంగలను, 11 వాహనాలను సీజ్‌ చేయడం జరిగిందన్నారు. మట్కా, జూదం, కోడిపందాలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన 458 కేసులలో 2512 మందిపై కేసు నమోదు చేసి రూ.70 లక్షల 24 వేల 711లు జరిమానా విధించడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా వివిధ కేసులలో వేగవంతంగా దర్యాప్తు చేపట్టేందుకు కషి చేసిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆయన రివార్డులను అందజేసి అభినందించారు.

➡️