జిల్లా , నియోజకవర్గం స్థాయి లో కంట్రోల్‌ రూమ్‌లు

Mar 15,2024 20:10
జిల్లా , నియోజకవర్గం స్థాయి లో కంట్రోల్‌ రూమ్‌లు

 ప్రజాశక్తి-విజయనగరం  : ఎన్నికలలో సమన్వయంతో పని చేయడానికి, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి జిల్లా, నియోజకవర్గం స్థాయి లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. జిల్లా స్థాయి, నియోజకవర్గం స్థాయిలో పని చేస్తున్న వారి మధ్య చక్కటి సమన్వయం ఉండాలని తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ కు కేటాయించిన అధికారులు, చేయవలసిన పలు రకాల విధులపై పిపిటి ద్వారా కలెక్టర్‌ అవగాహన కలిగించారు. కంట్రోల్‌ రూమ్‌ కు అందిన ఫిర్యాదులకు ఎన్నికల కమిషన్‌ ఒక్కో ఫిర్యాదుకు ఒక్కో కాల పరిమితిని సూచించిందని, వాటిని ఆయా టైం లైన్‌ లోపలే డిస్పోజ్‌ చేయాలని సూచించారు. ప్రధానంగా మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన , ఏర్పాట్ల పై లోపాలు, ఓటర్ల సమస్యలు తదితర అంశాల పై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసి వెంటనే పరిష్కరించడం లేదా తదుపరి అధికారికి పంపడం జరగాలన్నారు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదులన్నీ కొన్ని గంటల్లోనే పరిష్కారం కావాలని సూచించారు. మోడల్‌ కోడ్‌ ఫిర్యాదుల పై క్షేత్ర స్థాయి బృందాలు విచారణ జరపాలని, తుది నివేదిక సంబంధిత రిటర్నింగ్‌ అధికారి మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసారు. జిల్లా స్థాయి లో కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌ఛార్జిగా సిపిఒ, రిపోర్ట్స్‌ ఇన్‌ఛార్జిగా జిల్లా పరిషత్‌ సిఇఒ వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందికి, ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు ఐడి కార్డులను ఆర్‌ఒ జారీ చేయాలనీ సూచించారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ , ఆన్‌లైన్‌ పోర్టల్‌ , సాక్ష్యం యాప్‌ , సివిజిల్‌ , 1950 కాల్‌ సెంటర్‌ కు కు అందే ఫిర్యాదులను గడువు లోగా డిస్పోజ్‌ చేయాలని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, సహాయ కలెక్టర్‌ త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత , అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, కంట్రోల్‌ రూమ్‌ ఇంచార్జ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.ఓటరు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలి నియోజకవర్గం , మండల స్థాయి లో ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ఓటరు అవగాహనా కార్యక్రమాలను షెడ్యూల్‌ ప్రకారంగా నిర్వహించాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారులతో మట్లాడుతూ ప్రతి నియోజకవర్గం లో స్వీప్‌ కార్యక్రమాల కోసం ఇన్‌ఛార్జులను నియమించామని, తహశీల్దార్లు వెంటనే స్వీప్‌ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ఆదివారం 2కె రన్‌ నిర్వహించాలని, వారికీ టీషర్టు లను ఇవ్వాలని తెలిపారు. 25 న మహిళా ఓటర్ల తో రాలీ నిర్వహించాలని, కళాజాతాలు ప్రదర్శించాలని, రంగోలి పోటీలను నిర్వహించాలని తెలిపారు. సీనియర్‌ సిటిజెన్లకు యోగ, మెడిటేషన్‌ వంటి కార్యక్రమాలను , యువతకు బైక్‌ రాలీలను వేర్వేరుగా నిర్వహించాలన్నారు. స్వీప్‌ నోడల్‌ అధికారి హౌసింగ్‌ పీడీ శ్రీనివాస రావు వీటన్నిటిని పర్యవేక్షించాలని సూచించారు.

➡️