జీవన స్పర్శ నవల ఆవిష్కరణ

Dec 4,2023 17:46
కాకినాడ సాహితీస్రవంతి

ప్రజాశక్తి – కాకినాడ

సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీగనారా రచించిన జీవనస్పర్శ నవల ఆవిష్కరణ సభ స్థానిక యుటిఎఫ్‌ హోమ్‌లో జరిగింది. సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్‌. జోస్యుల కృష్ణబాబు సభకు అధ్యక్షత వహించారు. గదుల సాయిబాబా నవలను ఆవిష్కరించారు. ప్రముఖ కవి, సాహితీవేత్త అద్దేపల్లి ప్రభు నవలపై విశ్లేషణ చేశారు. ముఖ్య అతిథిగా మాజీ ఎంఎల్‌సి ఎంవిఎస్‌.శర్మ, సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రథాన కార్యదర్శి సత్యరంజన్‌ పాల్గొన్నారు. సభాధ్యక్షులు డాక్టర్‌ కృష్ణబాబు మాట్లాడుతూ కాకినాడ, పెద్దాపురంలో సాహితీస్రవంతి ఆవిర్భావ వికాసాల్ని వివరించారు. 2016లో గనారా మొదటి నవల కడలి కల్లోలంను సిపిఎం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిందని గుర్తు చేశారు. అదే నవలా ప్రక్రియను తీసుకుని గనారా జీవనస్పర్శ అనే మరో నవలను రాయటం అభినందనీయమని అన్నారు. అద్దేపల్లి ప్రభు నవలను విశ్లేషిస్తూ ‘ఒక ట్రేడ్‌ యూనియనిస్ట్‌ వ్యక్తిగత సామాజిక వ్యక్తిగత సామాజిక ప్రేమగాథ ఈ నవల. ఆంతరంగిక మనస్తత్త్వాన్నీ దాని తటపటాయింపుల్నీ, తట్టుకోలేని తనాలూ దానివల్ల వచ్చే ఆగ్రహాలనీ చాలా బాధ్యతతో రాసిన నవల’ అని అన్నారు. అనంతరం అవధానుల మణిబాబు, మార్ని జానకిరామ చౌదరి, కొత్తశివ, కట్టా కృష్ణారావు, సాలార్‌, బొల్లోజు బాబా తదితరులు మాట్లాడారు. అనంతరం అతిథులను, వక్తలను గనారా సత్కరించారు. కాకినాడ సాహితీస్రవంతి నగర అధ్యక్షులు మార్ని జానకిరామ చౌదరి అతిధుల్ని, వక్తల్ని వేదికపైకి ఆహ్వానించారు.

➡️