టిడిపికి కిశోర్‌చంద్రదేవ్‌ రాజీనామా

Feb 15,2024 21:30

ప్రజాశక్తి-కురుపాం :  తెలుగుదేశం పార్టీకి కేంద్ర మాజీమంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్ర సూర్యనారాయణదేవ్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఫ్యాక్సుద్వారా రాజీనామా లేఖ పంపారు. ఎన్‌డిఎలో టిడిపి చేరే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలోపేర్కొన్నారు. విద్వేష శక్తులతో చేతులు కలపడం సహించరాని విషయమని, అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనంటూ ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘ నేను మెంబర్‌గా ఉన్న యుపిఎ కేబినెట్‌ ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాను పొందాలనే ఆశతో మీరు ఎన్‌డిఎ లో చేరిన సమయం మీకు గుర్తుండే ఉంటుంది. పార్లమెంట్‌లో చర్చలు జరిగినప్పుడు ప్రతిపక్షాల డిమాండ్‌లో ఈ అంశం కూడా ఒకటి. దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించిన ఒక సమస్య గాలికి విసిరివేయబడింది. దేశంలోని యువతకు కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామన్న వాగ్దానం ఒక కలగానే మిగిలిపోయింది. కరెన్సీ ఆకస్మిక నోట్ల రద్దు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది, దీని నుంచి మన ప్రజలు ఇంకా కోలుకోలేదు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నుకోబడిన నాయకుడు తనకు తానుగా నిరంకుశ పాత్ర వహించాలని నిర్ణయించుకున్నాడు. ఇక నుండి ఎజెండాలో ఉన్న ఏకైక అంశం మన రాజ్యాంగ చట్రాన్ని కూల్చివేసి కొత్త హిందూ మతతత్వ రాజ్యాన్ని సృష్టించడం. బహుళ సాంస్కతికత అనేది మన సాంస్కతిక సమీకరణ మరియు కలయిక యొక్క గర్వం. మన భిన్నత్వం మధ్య ఐక్యత మన రాజ్యాంగానికి హాల్‌ మార్క్‌ నీతి. మతోన్మాదుల భీభత్స పాలనకు తెరలేపడం ద్వారా ఓటు బ్యాంకులను సృష్ట్టించుకోవడమే ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వ వన్‌ పాయింట్‌ ప్రోగ్రామ్‌గా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం ఇప్పటికే ఓక్లోక్రాటిక్‌ మోడ్‌లోకి జారిపోయింది. 2014కు ముందు జరిగిన దానికంటే ఎన్‌డిఎ నాయకత్వం మన దేశాన్ని పాతాళానికి తీసుకువెళ్లింది. ఇలాంటి విధ్వంసకర శక్తులతో మీరు మైత్రిని అనుసరిస్తున్న తీరు పట్ల నేను పూర్తిగా నిరాశ చెందాను. విస్తుపోయాను. నా రాజకీయ జీవితంలో 5వ దశాబ్దంలో నేను చూసిన అత్యంత దారుణమైన పరిస్థితి ఇది. శక్తి యొక్క చిన్న ముక్కల కోసం నేను నా ఆత్మను మార్చుకోలేననీ నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను’ అని చంద్రబాబుకు లేఖలో కిశోర్‌చంద్రదేవ్‌ పేర్కొన్నారు.

➡️