టిడిపితోనే బిసిలకు న్యాయం : వైరిచర్ల, శత్రుచర్ల

Feb 1,2024 21:33

ప్రజాశక్తి – కురుపాం : టిడిపితోనే బిసిలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎంపి వైరిచర్ల ప్రదీప్‌చంద్రదేవ్‌, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రమైన కురుపాం ధూళికేశ్వర ఆలయ సమీపంలో టిడిపి మండల అధ్యక్షులు కెవి కొండయ్య అధ్యక్షతన జరిగిన జయహౌ బిసి కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడిపి అంటేనే బీసీలకు ఆదరణ, బిసిల పార్టీగా గుర్తింపు పొందిందని అన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరష్‌ చంద్రదేవ్‌ మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలను నట్టేట ముంచిన ఘనత జగన్మోహన్‌రెడ్డిదేనని, కావున రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపునకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి టి.జగదీశ్వరి మాట్లాడుతూ బిసి, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి కడ్రక మల్లేష్‌, ఐదు మండలాల బిసి నాయకులు, టిడిపి, జనసేన కన్వీనర్లు, బిసిలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.బిసిలను వెనక్కి నెట్టిన జగన్‌ : సంధ్యారాణి సాలూరురూరల్‌ :బిసిలను పూర్తిగా వెనక్కు పెట్టిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే చెందుతుందని సాలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు. మండలంలోని బాగులసలో జయహో బిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిసిలంటే వైసిపి ఎంతో చులకనని విమర్శించారు. కావున మరికొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌పి భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ టిడిపికి బిసిలే వెన్నుదన్నారు. కార్యక్రమంలో సాలూరు, మక్కువ, మెంటాడ, పాచిపెంట, సాలూరు పట్టణ టిడిపి అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, గుల్ల వేణు, చలుమూరు వెంకటరావు, మత్స శ్యామ్‌, ముఖీ సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️