టిడిపిలో వీడిన ఉత్కంఠ

Mar 29,2024 21:20

చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా కళావెంకటరావు

విజయనగరం లోక్‌ సభకు కలిశెట్టి అప్పలనాయుడు

కంగుతిన్న నాగార్జున, బంగార్రాజు, మీసాల గీత, చంద్రశేఖర్‌

పార్లమెంట్‌ అధ్యక్ష పదవికి నాగార్జున రాజీనామా

అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్ల ర్యాలీ, నిరసన

ఇండిపెండెంట్‌గా పోటీకి బంగార్రాజు సిద్ధం

అన్ని నియోజకవర్గాల్లోనూ తిరుగుబావుట ఎగరవేస్తున్న నాయకులు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : టిడిపిలో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ల వ్యవహారంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిమిడి కళావెంకటరావును, విజయనగరం లోక్‌సభ అభ్యర్థిగా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడును పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. దీంతో, విజయనగరం జిల్లాలో టిడిపి టిక్కెట్ల వ్యవహారం కొలిక్కివచ్చినట్టుగా భావించవచ్చు. కళా వెంకటరావు శ్రీకాకుళం జిలాఇ్ల ఎచ్చెర్ల నియోజకవర్గం సీటును ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించడంతో ఆయనకు చీపురుపల్లి అసెంబ్లీ లేదా విజయనగరం పార్లమెంట్‌ సీటు వస్తుందా రాదా అని ఆ పార్టీ కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురు చూశారు. చివరకు చీపురుపల్లి అసెంబ్లీ సీటును అధిష్టానం కేటాయించింది. గతంలో ఆయన ఉణుకూరు, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యుత్‌, హోంశాఖా మంత్రిగా పనిచేశారు. కలిశెట్టి అప్పలనాయుడు టిడిపి ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన కూడా తొలి నుంచీ ఎచ్చెర్ల నియోజకవర్గ సీటును ఆశించారు. చివరకు విజయనగరం ఎంపి అభ్యర్థిగా ఆయనకు అవకాశం లభించింది. టిడిపి అభ్యర్థుల చివరి జాబితా విడుదల కావడంతో ఇప్పటివరకూ ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించిన పలువురు నాయకులు భంగపడ్డారు. వీరిలో చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు కిమిడి నాగార్జున, విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఉన్నారు. టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో నాగార్జున చీపురుపల్లి అసెంబ్లీ, విజయనగరం పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో తన కార్యాచరణ ప్రకటించనున్నట్టు కూడా చెప్పారు. మరోవైపు నాగార్జునకు మద్ధతు పలుకుతూ ‘కళా వద్దు.నాగార్జునే ముద్దు’ అంటూ టిడిపి కార్యకర్తలు చీపురుపల్లిలో ర్యాలీ నిర్వహించారు. నాగార్జున క్యాంపు కార్యాలయం ముందు కూడా పార్టీ కరపత్రాలను తగలబెట్టి నిరసన తెలిపారు. దీంతో, ఈ నియోజకవర్గంలో టిడిపిలోని అంతర్గత రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరోవైపు జనసేన పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోకవర్గం సీటు కోల్పోయిన కర్రోతు బంగార్రాజుకు భీమిలి సీటు ఇస్తారంటూ పార్టీలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఐవిఆర్‌ఎస్‌ సర్వే కూడా చేపట్టారు. చివరకు ఆ సీటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేటాయించడంతో కర్రోతు ఆశలు అడియాశలయ్యాయి. ఈనేపథ్యంలో ఆయన ఇండిపెండింట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీతపేరును చీపురుపల్లి అసెంబ్లీ, విజయనగరం ఎంపీ అభ్యర్థిత్వానికి కూడా పార్టీ ఐవిఆర్‌ఎస్‌ నిర్వహించింది. దీంతో, గీతకు ఈ రెండింటిలో ఏదో ఒక సీటు ఖాయమంటూ చర్చ నడించింది. ఆచరణలో అటువంటిదేమీ లేకపోవడంతో ఆమెతో తన అనుయాయులు ఖంగుతిన్నారు. ఎంపీ అభ్యర్థిగా డెంకాడ ఎంపిపి కంది చంద్రశేఖర్‌ పేరు కూడా పరిశీలనకు వెళ్లినప్పటికీ చివరి క్షణాల్లో తిరస్కరణకు గురైంది.ఎస్‌.కోట నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించి నాలుగు రోజుల క్రితమే భంగపడ్డ గొంప కృష్ణ, అధిష్టానంతో జరిగిన చర్చల తరువాత కూడా వెనక్కి తగ్గలేదు. కార్యకర్తలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటిస్తామంటూ పార్టీకి హెచ్చరించారు. మరోవైపు గజపతినగరంలో సీటు కోల్పోయిన కెఎ నాయుడు, ప్రస్తుత అభ్యర్థి అభ్యర్థి శ్రీనివాసరావుకు సహకరించే పరిస్థితే లేదంటూ తేల్చిచెప్తున్నారు. రాజాంలో మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతితోపాటు ఆయన అనుయాయులు కూడా ఇంకా కోండ్రు మురళితో కలిసి నడవడం లేదు. మురళి కూడా బుజ్జగింపు ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో, ఇక్కడి తెలుగు తమ్ముళ్ల వ్యవహారం ఇప్పుట్లో తేలేటట్టు కనిపించడం లేదు. విజయనగరం అభ్యర్థి అదితి విజయలక్ష్మితో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కలిసి వెళ్లడం లేదు. ఇలా తొలి నుంచీ టిక్కెట్‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసి భంగపడ్డవారంతా అధిష్టానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్‌.కోట, చీపురుపల్లిలో రాజీనామాలతోపాటు పార్టీపై తిరుగుబావుట ఎగరవేస్తుండగా, మిగిలిన చోట్ల గుంభనంగా ఉన్నారు. పరిణామాలు ఎలా దారితీస్తాయో కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.

➡️