టిడ్కో ఇళ్ల రాజకీయం

Mar 23,2024 21:05

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌: ‘తాంబూళాలు ఇచ్చాం తన్నుకు చావండి’ అన్న చందంగా ఉంది అధిపార పార్టీ నాయకుల పరిస్థితి. ఎన్నికల వేళ ఓట్లు కోసం అనేక జిమ్మిక్కులు చేస్తున్నారు. పదేళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయని ప్రభుత్వాలు.. తాజాగా ఓట్లు కోసం అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులకు తాళాలు అందజేసి చేతులు దులుపుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇళ్ల తాళాలు పంపిణీ కార్యక్రమం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అధికార పార్టీ నాయకులు చేపట్టారు. విజయనగరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సారిపల్లి వద్ద 2650 ఇళ్లు, సోనీ నగర్‌లో 1120 టిడ్కో ఇళ్లు 2017లో మంజూరు చేసిన విషయం తెల్సిందే. నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఇవ్వలేకపోయింది. అదే పరిస్థితి ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో కొనసాగించింది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా విద్యుత్తు, తాగునీరు, రోడ్లు పూర్తిస్ధాయిలో నిర్మాణాలు జరగకుండానే లబ్ధిదారులకు ఇటీవల తాళాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపి టిడ్కో) గృహ లబ్ధిదారులకు రుణాల మంజూరు చేసింది. జి ప్లస్‌ త్రి గృహాలు నిర్మించిన కాలనీల్లో మౌలిక వసతుల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోంది.చాలా కాలం క్రితం నిర్మించి లబ్ధిదారులకు అప్పగించకపోవడం, నిర్వహణ లేకపోవడంతో ఇళ్లు పాడువుతున్నాయి. కిటికీలు చెదలు పట్టి, తలుపు పగిలిపోయి, సన్‌షేడ్‌లు పెచ్చులూడి పోయి దర్శనమిస్తున్నాయి. నత్తనడకన మౌలిక వసతుల పనులుసారిపల్లి, సోనినగర్‌ వద్ద ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ నేటికీ గృహ నిర్మాణాలను పూర్తి చేయలేదు. ఇంట్లో ఉండేందుకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. ఏదో ఒకలా మమా అనిపించి రంగులద్ది లబ్ధిదారులకు తాళాలు ఇచ్చి ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకున్నారు. రోడ్లు, యుజిడి, సీవేజి ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, మంచినీటి ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, వాటర్‌ పైపులైన్లు, విద్యుద్దీపాలు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రోడ్లకు సంబంధించి పనులను అసలు ప్రారంభించలేదు. యుజిడి మంచినీటి వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయలేదు. విద్యుత్‌ శాఖ నుంచి విద్యుత్‌ పోల్స్‌, లైన్లు ఏర్పాటు జరగలేదు. కేవలం ఒక్క లైన్లు మాత్రమే విద్యుత్‌ స్తంబాలు వేసి లైన్లు ఇవ్వడం జరిగింది. నిర్మాణం జరిగిన ఇళ్లకు ఇంకా విద్యుత్‌ సరఫరా ఇవ్వలేదు. ఈ పథకం కింద లబ్ధిదారులకు కేంద్రం ప్రభుత్వం రూ.1.50 లక్షల రాయితీ అందజేస్తోంది. ప్రభుత్వం మూడు కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఎ- కేటగిరీ (300 చదరపు అడుగులు), బి కేటగిరీ (364 చదరపు అడుగులు), సీ కేటగిరీ (430 చదరపు అడుగులు) విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కేటగిరీలోని ఇళ్లను లబ్దిదారులకు ప్రభుత్వం ఉచితంగానే రిజిస్ట్రేషన్లు చేస్తోంది. బి-కేటగిరీ గృహ నిర్మాణాలకు రూ.7.65 లక్షలు ఖర్చవుతోంది. లబ్ధిదారుల వాటాగా రూ.50 వేలు చెల్లించారు. సి- కేటగిరికి రూ.8.65 లక్షలు ఖర్చవుతోంది. లక్ష రూపాయలు లబ్ధిదారుని వాటాగా చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా ద్వారా రుణాలు సమకూర్చుకుని టిడ్కో సంస్థకు చెల్లించాల్సి ఉంది. లబ్దిదారుల్లో ఆందోళనపట్టణాల్లో అద్దెల భారాన్ని తగ్గించుకునేందుకు అప్పులు చేసి వేలాది రూపాయలు డిపాజిట్లు చెల్లించారు. ఐదేళ్లలో ఇప్పటికీ వారికి ఇళ్లు అందుబాటులోకి తీసుకొని రాలేదు. దీంతో ఇళ్ల అద్దెలతోపాటు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికీపూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చే విధంగా పనులు పూర్తి చేస్తారో అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

➡️