డంపింగ్‌ యార్డు తరలింపుపై తక్షణ చర్యలు

Jan 4,2024 21:53

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : స్థానిక మున్సిపాల్టీ పరిధిలో అతి ప్రధానమైన సమస్యల్లో ఒకటైన రాయగడ రోడ్‌ శివారులో గల డంపింగ్‌ యార్డును తక్షణమే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో మున్సిపల్‌ పాలకపక్ష సభ్యులతో గురువారం కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ సమీపాన డంపింగ్‌యార్డు ఉన్నందున పలు వార్డుల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మూలంగా అక్కడి నుంచి డంపింగ్‌ యార్డ్‌ను వేరే చోటకు తరలించేందుకు పలుమార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చామన్నారు. అయినా స్థానికంగా ఉన్న కొన్ని కారణాల రీత్యా సమస్య పరిష్కారం వాయిదా పడుతూ వస్తుందన్నారు. కావున ఈ సమస్యను సాధ్యమైనంత వరకు శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. అందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని, పట్టణ ప్రజల ఆరోగ్య సమస్యలను దష్టిలో పెట్టుకొని తప్పక సమస్యకు పరిష్కారం చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇందుకు కలెక్టర్‌ స్పందిస్తూ సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమీక్ష చేసి పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీస్వరి, ఆర్‌డిఒ కె.హేమలత, కమిషనర్‌ రామప్పలనాయుడు,, పట్టణ వైసిపి అధ్యక్షులు కొండపల్లి బాలకష్ణ, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

➡️