డయేరియా బాధితులకు సిపిఎం పరామర్శ

Feb 12,2024 00:40

మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు :
స్థానిక శారదా కాలనీలో కలుషిత తాగునీటి వల్ల డయేరియాతో చనిపోయిన ఎం.పద్మ కుటుంబ సభ్యులను, ఇతర డయేరియా బాధితులను సిపిఎం బృందం ఆదివారం పరామర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌ మాట్లాడుతూ పద్మ కుటుంబ పరిస్థితి కడు దయనీయంగా ఉందన్నారు. నెలన్నర క్రితం ఆమె తండ్రి చనిపోయాడని, తల్లికి వెన్నుపూస ఆపరేషన్‌ జరిగి పూర్తిగా మంచానికే పరిమితమైందని చెప్పారు. పద్మ తర్వాత మిగిలిన ఐదుగురు సంతానికి, ఆమె తల్లికి ఇప్పటి వరకూ ఆమే ఆధారమన్నారు. పద్మ మృతితో ఆ కుటుంబం ఆదారం కోల్పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బాదితుల్ని పరామర్శించిన వారిలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జీవన్‌, తదితరులున్నారు.

➡️