తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారు చేయాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి- రాయచోటి తప్పులు లేని ఓటరుజాబితా తయారు చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌, అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా 2024, సాధారణ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌, జెసి ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎన్నికల విభాగం అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో తప్పులు లేని ఓటర్‌ జాబితా తయారు చేసేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిఎస్‌ఇ, డిఎస్‌ఇ అంశంలో భాగంగా 7, 15, 30 రోజులు పైబడిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. పిఎస్‌ఇ, డిఎస్‌ఇలో వందశాతం ఫారం 7 జనరేట్‌ చేయాలన్నారు. డబుల్‌ ఎంట్రీలు ఉండకుండా చూసే బాధ్యత తహశీల్దార్లు, ఆర్‌డిఒలపైనే ఉందని చెప్పారు. క్లస్టర్‌ వారీగా ఫారం 7, ఫారం 8, సాంకేతిక సమస్యతో పెండింగ్‌ ఉన్నవాటిపై బిఎల్‌ఒలతో తహశీల్దార్లతో సమావేశం నిర్వహించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటర్‌ గుర్తింపు కార్డులు ఎప్పటికప్పుడూ పంపిణీ చేయాలన్నారు. డూప్లికేట్‌ ఓట్లును ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం తొలగించాలన్నారు. జిల్లాలో పెండింగ్‌ ఫారాలు లేకుండా వెంటనే క్లియర్‌ చేయాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌ వివిధ అంశాలలో ఎన్నికల విభాగం అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.

➡️