తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లల విజయానికి సోపానం

Dec 16,2023 21:07

 ప్రజాశక్తి – పాచిపెంట :  తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లల విజయానికి సోపానమని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రత్యేక అధికారిగా తల్లిదండ్రులతో పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల దృష్టి సారించాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధన చేసి, ఆ అంశాన్ని బాగా అర్ధం చేసుకోవాలన్నారు. దీన్ని ఇంటి వద్ద సమయం కేటాయించి నేర్చుకొనే పర్యవేక్షణ తల్లిదండ్రులు చేయాలన్నారు. మార్చి 18 నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పారు. టెన్త్‌ ప్రతి విద్యార్థికి కీలకమన్నారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కొద్ది సేపు పర్యవేక్షణ బాధ్యతలను తీసుకుంటే ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఇంకా సరిగ్గా రెండు నెలల కాలం ఉందని, వారిపై దృష్టి సారించాలని సూచించారు.విశ్వనాధపురంలో ధాన్యపు కొనుగోళ్ల పరిశీలనజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాధపురంలో ధాన్యపు కొనుగోళ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ఎకరాకు వచ్చిన దిగుబడి ఎకరానికి అయ్యే పెట్టుబడి గురించి ఆరా తీశారు. తుపానులో జరిగే పంట నష్టాల గురించి రైతులను ప్రశ్నించగా గ్రామంలో పెద్దగా పంట నష్టాలు జరగలేదని తెలిపారు. ధాన్యం సంచులను తనిఖీ చేసి రైతులకు ఇవ్వాలని విఎఎలను ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు. తేమ 17శాతం లోపు ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలని, నాణ్యత ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించి ధాన్యపు కొనుగోలు జరపాలని కొనుగోలు సిబ్బందిని ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రం తనిఖీమండలంలోని అమ్మవలస అంగన్వాడీ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ తనిఖీ చేశారు. అంగన్వాడీ నిర్వహణ తీరు, అంగన్వాడీ పరిధిలో గర్భిణీలు, బాలింతలు, రక్తహీనత కలిగిన వారు తదితర వివరాలు పరిశీలించారు. పౌష్టికాహారం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ లక్ష్మీకాంత్‌, తహశీల్దార్‌ రాజశేఖర్‌, వ్యవసాయ అధికారి తిరుపతిరావు, రైతులు పాల్గొన్నారు.

➡️