తహశీల్దారు కార్యాలయం ముట్టడి

ప్రజాశక్తి-బల్లికురవ: కూకట్లపల్లి దళితుల భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ముట్టడించారు. తహశీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు. తహశీల్దారు సరైన సమాధానం చెప్పకుండా దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు నిరసనగా ఆఫీసు లోపలికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. తహశీల్దారు బల్లికురవ పోలీసులను పిలిపించి బెదిరించడానికి ప్రయత్నం చేసినా బెదరకుండా అడ్డు తొలగేది లేదని పేదలు తెగేసి చెప్పారు. దీంతో పోలీసులు ఎమ్మార్వోతో, ఆందోళనకారులతో చర్చించారు. 15రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని తహశీల్దారు ఇచ్చిన హామీ మేరకు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. గత సంవత్సరం కాలం నుంచి కూకట్లపల్లి దళితులు తమకు ఇచ్చిన డీకే భూములు అన్యాక్రాంతమై అగ్రకుల పెత్తందారులు దౌర్జన్యంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని, పిఒటి చట్ట ప్రకారం దళితుల భూములు దళితులకే ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని సిపిఎం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికైనా స్పందించకపోతే నిరవధిక ధర్నా చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సభ్యులు గొల్లపూడి అంజయ్య, కూకట్లపల్లి దళితులు వేల్పుల ఏబు, దాసరి యోహాను, తంగిరాల సామేలు, తంగిరాల రాణమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️