తహశీల్దార్‌ కార్యాలయమే బార్‌

Feb 7,2024 20:29

ప్రజాశక్తి- రేగిడి : రేగిడి మండల కాంప్లెక్స్‌లో ఉన్న నూతన తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిత్యం అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ఈ కార్యాలయాన్ని మందులు బాబు బార్‌గా మార్చేసుకున్నారు. ప్రతి రోజు సాయంత్రం పూట వందలాది మంది మందుబాబులు ఇక్కడకు చేరుకుని మద్యం సేవించి జల్సాలు చేస్తుంటారు. కార్యాలయం ముందు, వెనుక భాగాల్లో మద్యం బాటిళ్లు దర్శనమిస్తుండటమే దీనికి నిదర్శనం. కాగా ఈ కార్యాలయాన్ని పగటి పూట ప్రేమికులు సైతం వినియోగించుకుంటున్నట్లు తెలిస్తోంది. రాత్రి మందుబాబులు పగలు ప్రేమికుల అసాంఘిక కార్యక్రమాల నడుమ నూతన తహశీల్దార్‌ కార్యాలయం నలిగిపోతుందని స్థానికులు వాపోతున్నారు. మందుబాబుల ఆగడాలకు అక్కడ ఏర్పాటు చేసిన అద్దాల కిటికీలు కూడా పగలిపోయి కనిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చును. రేగిడి తహశీల్ధార్‌ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 2018 ఏప్రిల్‌ 22న టిడిపి ప్రభుత్వ హాయామంలో ఎస్‌డిపి నిధులతో అప్పటి జిల్లా కలెక్టర్‌ జవహర్‌ రెడ్డి రూ.90 లక్షలతో నూతన తహశీల్దార్‌ కార్యాలయం మంజూరు చేశారు. ఈ కార్యాలయ నిర్మాణానికి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు చేతుల మీదుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 9 నెలల్లో ఈ నూతన తహశీల్దార్‌ కార్యాలయం అన్ని అంగులతో పూర్తిచేసి అప్పగించాలని కాంట్రాక్టర్‌ శ్రీనివాసరావుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే చివరి దశకు వచ్చినప్పటికీ ప్రభుత్వం పూర్తిగా బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేయకపోవడంతో ధరలు పెరిగి నిర్మాణం భారాన్ని భరించలేని కాంట్రాక్టర్‌ చేతులెత్తేశాడు. దీంతో నిర్మాణం పూర్తి కాలేదు. పిచ్చిమొక్కల నడుమ భవనంనిర్మాణం 90 శాతం పూర్తి కావచ్చినా కాంట్రాక్టర్‌కు నిధులు చెల్లించకపోవడంతో పనులను ఆపేశారు. నిర్మాణం చేసి ఇప్పటికి సుమారు ఆరు సంవత్సరాలు కావడంతో వినియోగంలో లేని భవనం చుట్టూ పిచ్చి మొక్కలు చేరి ప్రారంబం కాకముందే శిధిలావస్థకు చేరేలా కనిపిస్తోంది. పాత తహశీల్దార్‌ కార్యాలయం శిధిలావస్థలో ఉండటంతో సిబ్బంది అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఉద్యోగం చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ భవనం ఎప్పుడు కూలుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆర్‌డిఒ ఆరాఇటీవల నూతన ఆర్‌డిఒగా వచ్చిన బొడ్డేపల్లి శాంతి నూతన తహశీల్దార్‌ కార్యాలయం నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని తహశీల్దార్‌ బి సుదర్శన్‌రావును అడిగి తెలుసుకున్నారు. బదిలీపై వచ్చిన తహశీల్దార్‌ వీటి విషయంపై చెప్పలేని పరిస్థితి నెలకొంది. పరిస్థితిని కాంట్రాక్టర్‌, ఆర్‌అండ్‌బి అధికారులను పిలిపించి మాట్లాడి అన్ని అంగులతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఒ సూచించారు. ఆరేళ్లు గడిచినా ఎందుకు అసంపూర్తిగా ఉందో తెలుసుకుని నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి నూతన తహశీల్దార్‌ కార్యాలయాన్ని మందు బాబుల నుంచి రక్షించి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, అధికారులు కోరుతున్నారు.

➡️