తుపానుతో వరి పంటకు తీవ్ర నష్టం

అనకాపల్లి మండలం మార్టూరులో నేలమట్టమైన వరి చేను

ప్రజాశక్తి-అనకాపల్లిఅనకాపల్లి

మండలంలో సాధారణ వరి విస్తీర్ణం సుమారు 7,400 ఎకరాలు కాగా ఈ ఏడాది 5,274 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందలో 1300 ఎకరాల వరి పంట వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయింది. మండలంలోని మార్టూరు, తుమ్మపాల, వెంకుపాలెం, సీతానగరం, అనకాపల్లి, కుంచంగి, కూండ్రం, బవులవాడ, రేబాక తగరంపూడి తదితర గ్రామాల్లో రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, వర్షాలు లేకపోయిన ప్రత్యామ్నాయ నీటి వనరులను ఉపయోగించుకొని పంటను రక్షించుకుంటూ వచ్చారు. తీరా పంట ఇంటికి వచ్చే సమయంలో తుఫాను రైతులను ముంచుతోంది. తుఫాన్‌ కారణంగా వీచిన గాలులకు ఆయా గ్రామాల్లో పండిన పంట నేలమట్టమైంది. వందలాది ఎకరాల్లో రైతులు వరి పంట కోత కోయగా, దానిని కుప్పలుగా పెట్టేందుకు కూలీలు దొరక్కపోవడంతో పంట పొలంలోనే ఉండిపోయింది. తుపాన్‌ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పనులు తడిసి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం వర్షం ప్రభావం వరి పంటపై ఉండదని చెబుతున్నారు.ఆందోళనలో అన్నదాతలుకె.కోటపాడు : ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న వరి పంట తుపాన్‌ కారణంగా నష్టం జరుగుతుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కె.కోటపాడు మండలంలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో 2వేల హెక్టార్లలో పంట వేశారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సెప్టెంబర్‌ నెలాఖరి వరకు నాట్లు వేస్తూనే ఉన్నారు. తరువాత వర్షాలు పూర్తిగా ముఖం చాటేయడంతో 500 హెక్టార్ల పైనే వరి పంట ఎండిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వరి పంట పండించారు. తెగుళ్ళ బారి నుండి వరి పైరును కాపాడుకుంటూ వచ్చారు. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం మండలంలోని 30 శాతం వరి కోతల పూర్తయ్యాయి. తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో కోత కోసిన వరి పనలు పూర్తిగా ఎండకుండానే రైతులు హడావుడిగా కుప్పలు వేశారు. దీని వల్ల పంట నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు..తడిసిన వరి పంటబుచ్చయ్యపేట : మిచౌంగ్‌ తుఫాను నేపథ్యంలో సోమవారం ఉదయం నుండి వర్షం ఎడతెరిపి లేకుండా పడింది. దీంతో మండలంలోని చిన్నప్పన్నపాలెం, పోలేపల్లి, వడ్డాది తదితర గ్రామాలో రైతులు కోతల కోసి పొలాల్లోనే విడిచిపెట్టిన పంట తడిసిపోయింది. తుఫాను వల్ల వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.బిక్కుబిక్కి మంటున్న రైతులుసబ్బవరం : మండలంలోని తుఫాన్‌ కారణంగా వరి రైతులు బిక్కు బిక్కు మంటున్నారు. అనావృష్టిని తట్టుకొని వరి పంట వేస్తే తుపాన్‌ తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో 3300 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను ఈ ఏడాది వరి పంటను 3100 ఎకరాల్లో నాట్లు వేసినట్లు మండల వ్యవసాయాధికారి పోతల సత్యనారాయణ తెలిపారు. పంట కాలంలోని సున్నిత దశలలో వర్షాల్లేక గింజ పూర్తిగా కట్టక కొంత పొల్ల రూపంలో ఉండిపోతుంది. మిగిలిన పంట చేతికి వస్తుందనుకున్న దశలలో తుఫాను రైతులను బెంబేలెత్తిస్తోంది. ఈ రెండు రోజుల్లో సబ్బవరం మండలంలో 20.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అనావృష్టి కారణంగా వరి పంట పండక 110 ఎకరాల వరకు కోసివేయగా, మరో 220 ఎకరాల్లో పండిన పంటను కోతలు కోసి కుప్పలు పెట్టారు. ఇంకా కోత కోయాల్సిన పంటపై రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల్లో తీవ్ర అలజడికొత్తకోట : మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావం రైతులలో తీవ్ర అలజడి రేపింది. ఆరు గాలం పాటు శ్రమించడంతో పక్వానికి వచ్చిన వరి పంట నీటి పాలవుతోందన్న భయంతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది లో గత మూడు నెలలు గా సకాలంలో వర్షాలు కువక పోయిన సరే వరి పంటలను రైతులు కష్ట పడి నిలబెట్టారు. కోత దశలో ఉన్న వరి పంటను రేపో మాపో సమాకుర్చుకోవాల్సిన దశలో తీవ్ర తుఫాన్‌ రావడం తో కొంత మంది రైతులు ఆందోళనలో ఉన్నారు. రావికమతం మండలంలో సుమారు ఆరు వేలకు పైగా ఎకరాలలో వరి నాట్లు వేశారు. కొత్తకోట, జెడ్‌.కొత్తపట్నం, చీమలపాడు, గంపవానిపాలెం, దొండపూడి, టి.అర్జాపురం, కన్నంపేట, వమ్మవరం, మర్రివలస గ్రామాల భూములకు స్థానిక కల్యాణపు లోవ జలాశయం నీరు అందించగా, మేడివాడ, రావికమతం, గుడివాడ, గొంప, గుడ్డిప, మరుపాక, మట్ట వానిపాలెం తదితర ప్రాంతాల భూములకు పెద్దేరు జలాశయంతో పాటు స్థానిక రైతుల మోటార్లు ద్వారా పంటలను పండించారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా తుఫాన్‌ ఏర్పడంతో రైతులలో తీవ్ర ఆందోళన ఏర్పడింది. మండలం కొన్ని చోట్ల వరి పంట పక్వానికి రాగా మరి కొన్ని చోట్ల కోసిన పంట వర్షానికి తడిసి ముద్దవుతోం ది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వచ్చినా అధిక పెట్టు బడులతో నిలబెట్టిన పంట చేతికి అందే సమయంలో ఇలా తుఫాన్‌ రావడంతో రైతు కంట కన్నీరు వస్తోంది.వర్షపు నీటిలో వరి పంటనక్కపల్లి : మిచౌంగ్‌ తుపాన్‌ దూసు కొస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో రైతుల గుండెల్లో అలజడి నెలకొంది. నిన్న, మొన్నటి వరకూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కష్ట నష్టాల కోర్చి పండించిన పంట కోతకు వచ్చే సమయంలో తుపాన్‌ హెచ్చరికలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి మండలంలో 5250 సాధారణ విస్తీర్ణం కాగా, 1300 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. వర్షాలు లేక పోవడంతో సుమారుగా 700 ఎకరాల వరకు ఎండిపోయాయి. మిగిలిన 600 ఎకరాల్లో వరిని కాపాడుకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడ్డారు.వారం, పది రోజుల్లో అడపాదడపాగా రైతులు సుమారుగా 100 ఎకరాల్లో వరి కోతలు కోశారు. ఇంకా 500 ఎకరాల్లో వరి కోత దశకు చేరుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో సోమవారం కురిసిన వర్షం, వీచే గాలులకు వరి చాలా చోట్ల నేల కొరిగింది. కోత దశకు వచ్చిన వరి పంట చేతికందేనా అంటూ రైతులు అవేదన చెందుతున్నారు.

➡️