తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

ప్రజాశక్తి-గుంటూరు : భారత వాతావరణ శాఖ జారీ చేసిన తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ ఎం.వేణుగోపా ల్‌రెడ్డి శనివారం కలక్టరేట్‌ నుండి జెసి రాజకుమారితో కలిసి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. తుపాను హెచ్చరికల కేంద్రం, భారత వాతావరణ శాఖ, స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన ఈనెల 3వ తేది నుండి జిల్లాలో వర్షాలు పడే అవకాశం వుందన్నారు. ఈనెల 5వ తేది నెల్లూరు – మచిలీపట్నం వద్ద తుఫాను తీరం దాటే అవకాశం వుందన్నారు. తీరప్రాంత జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా వుండాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు పంట నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నారు. వరి పంట కోత చేసి పంట పొలాల్లో వదిలేస్తే ధాన్యం దెబ్బతినవచ్చన్నారు. పైతేదీలలో పంటల కోత చేయకుండా రైతులకు వ్యవసా యాధికారులు క్షేత్ర స్థాయిలో సూచనలు అందించాలని చెప్పారు. బలమైన గాలులు కూడా వీచే అవకాశం వున్నందున కరెంట్‌ స్తంబాలు దెబ్బతినే అవకాశం వుందని, అందు వల్ల కరెంట్‌ సరఫరా అంతరాయం ఏర్పాడే అవకాశం వున్నందున విద్యుత్‌ శాఖాధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి విద్యుచ్చక్తి సరఫరాను క్రమబద్ధీకరించాల్సి వుంటుందన్నారు. గాలుల వలన రోడ్లపై చెట్లు కూలితే ఆర్‌అండ్‌బి, పంచాయితీరాజ్‌ శాఖ అధికారులు వాటిని తొలగించి రోడ్డు ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాల్సి వుందన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు వర్షపు నీరు నిల్వ వుండకుండా, కాల్వల్లో నీటి ప్రవాహం సరిగా జరిగేలా పూడికలు తీసి క్రమబద్ధీకరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి నష్టమేమీ వాటిల్లకుండా అవసరమైన అన్ని చర్యలు పకద్భందీగా చేపట్టాలని సూచించారు.
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తుపాను నేపథ్యంలో నష్టనివారణపై అధికారులో పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ టెలికాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించి పంట నష్టపోకుండా చూడాలన్నారు. పాత, అవసాన దశలో ఉన్న భవనాలను గుర్తించి అందులోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. గాలి తీవ్రత సుమారు 65-80 కిలోమీటర్ల వరకు ఉండే అవకశం ఉన్నందున కరెంటు స్తంభాలు పడి పోకుండా, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు.

➡️