తుపాను బీభత్సం

ప్రజాశక్తి-కనిగిరి: తుపాను ప్రభావం కారణంగా కనిగిరి పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో వృక్షాలతోపాటు విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. సంబంధిత శాఖ అధికారులు రోడ్లకు అడ్డంగాపడ్డ చెట్లను తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. కనిగిరి ఆర్టీవో పాలపర్తి జాన్‌ ఇర్విన్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడ ప్రమాదం జరగకుండా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను చేపట్టారు. కనిగిరి మండలం లింగారెడ్డిపల్లిలో ఆటో మీద పడిన వృక్షాన్ని పక్కకు తొలగించే చర్యలు చేపట్టారు. మంగళవారం సాయంత్రం వర్షం తగ్గడంతో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారు. కనిగిరి మండలం ఏరువారిపల్లిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు సర్పంచ్‌ దమ్ము వెంకటయ్య వర్షం కురుస్తున్నా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చర్యలను విద్యుత్‌ సిబ్బందితో కలిసి స్వయంగా చేపట్టారు. కొనకనమిట్ల: మండలంలో తుపాను ప్రభావం వల్ల రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా వీచడంతో కొన్నిచోట్ల మిర్చి పంట నేలకొరిగింది. ఇదేవిధంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే పంటలు దెబ్బతినే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గనివెన్నపాడు, వద్దిమడుగు, కొనకనమిట్ల, నాగంపల్లి, ఎదురాళ్లపాడు, బసాపురం బీసీ, ఎస్సీ కాలనీల్లో నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపై నీరు చేరింది. దీంతో అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుపాను తీరం దాటకపోతే పంటలు, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. పొదిలి: పొదిలిలో తుపాను ప్రభావంతో గత రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణం లోని ఆర్‌టిసి బస్టాండ్‌, నవాబుమెట్ట, పిఎన్‌ఆర్‌ కాలనీ, రథం రోడ్‌, ఇస్లాంపేట, మార్కాపురం అడ్డరోడ్డు సమీపంలో విద్యుత్‌ స్తంభాల వద్ద సమస్య ఏర్పడిందని, చెట్లు విరిగి తీగలపై పడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి వీటికి మరమ్మతులు నిర్వహించి పట్టణంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ శాతం గాలి కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొం టున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం పట్టణంలో విద్యుత్‌ను అంతరాయం లేకుండా అందజేస్తామని, ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని వారు కోరారు.

➡️