తూతూమంత్రంగా వైద్య శిబిరాలు

వైద్య శిబిరాలు

రంగులోయలో వైద్యాధికారులు గైర్హాజరు

కిందిస్థాయి సిబ్బందితో మొక్కబడి సేవలు

పెదవి విరుస్తున్న మారుమూల గిరిజనులు

ప్రజాశక్తి- పెదబయలు :ప్రభుత్వ వైద్యసేవలే దిక్కుగా ఉన్న మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యశిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం పోయిపల్లి పంచాయతీ రంగులోయలో ఆరోగ్యసురక్ష వైద్యశిబిరం మొక్కుబడిగా నిర్వహించడంపై స్థానిక గిరిజనులు పెదవి విరుస్తున్నారు. గోమంగి పిహెచ్‌సిలో ఇద్దరు వైద్యాధికారులు ఉన్నప్పటికీ, రంగులోయ వైద్యశిబిరానికి ఇద్దరూ డుమ్మా కొట్టి, కిందిస్థాయి సిబ్బందితో అయిందనిపించుకుని చేతులు దులుపుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు. మారుమూల గ్రామాలు కావడంతో ఎవ్వరూ అడిగే పరిస్థితి లేదనే నిర్లక్ష్యమో, గిరిజనులంటే చిన్నచూపో? లేకుంటే ఎన్నికల హడావిడిలో అందరూ ఉండడంతో తమను ఎవరు పట్టించుకుంటారులే అనే ధోరణియో తెలియదుగానీ, రంగులోయ వైద్యశిబిరం నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం సరికాదని, ఇలాంటి మొక్కుబడి వైద్యశిబిరాలతో ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. హెచ్‌వి, ఎంఎల్‌హెచ్‌ఫిలు వైద్యశిబిరానికి వచ్చి లెక్కకు ఒకటి పూర్తిచేశామని అనిపించుకుని వెళ్లిపోయారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వైద్యశిబిరానికి డాక్టర్లు రాలేదని తెలుసుకున్నారేమోగానీ, వైద్యపరీక్షలకు వచ్చిన వారు కూడా అంతంత మాత్రంగానే ఉండడం విశేషం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, గ్రామాల్లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించేటప్పుడు వైద్యులు, సిబ్బందితోపాటు అత్యవసర మందులతో వెళితేనే ప్రయోజనముంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రంగులోయలో నిర్వహించిన వైద్యశిబిరం

➡️