తెనాలిలో స్మార్ట్‌ సిగలింగ్‌ వ్యవస్థ ప్రారంభం

Feb 11,2024 00:35

ప్రారంభోత్సవంలో చల్లా రాజేంద్రప్రసాద్‌, ఎమ్మెల్యే
ప్రజాశక్తి-తెనాలి :
సామాజిక బాధ్యతతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని సిసిఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌ చల్లా రాజేంద్రప్రసాద్‌ అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగల్స్‌ను ఆయన స్థానిక ఎమ్మెల్యే ఎ.శివకుమార్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార దృక్పథమే కాకుండా తనపై సామాజిక బాధ్యత ఎంతో ఉందని, అందుకే సిగల్స్‌ ఏర్పాటుకు సహకరించానని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో 8 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిగల్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ప్రజల చిరకాల స్వప్నం ఫలించిందిపట్టణ ప్రజల చిరకాల స్వప్నం ట్రాఫిక్‌ సిగల్స్‌ ఏర్పాటు ఫలించిందని ఎమ్మెల్యే శివకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్‌ సిగలింగ్‌ వ్యవస్థ ప్రారంభానంతరం స్థానిక కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. స్మార్ట్‌ సిగల్స్‌ ఏర్పాటుకు సహకరించిన సిసిఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌ చల్లా రాజేంద్రప్రసాద్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పట్టణంలో ప్రధానమైన సమస్య ట్రాఫిక్‌ అని, దానిని అధికమించేందుకు స్మార్ట్‌ సిగల్స్‌ ఏర్పాటు సుదీర్ఘ స్వప్పంగా చెప్పారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, కమిషనర్‌ బి.శేషన్న, డీఎస్పీ బి.జనార్ధనరావు, ఎంవిఐ రాఘవరావు మాట్లాడారు. ట్రాఫిక్‌ వ్యవస్థపై విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు రాజేంద్రప్రసాద్‌ ద్వారా బహుమతులు అందించారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ టి.రాధిక, వైస్‌ చైర్మన్‌ ఎం.హరిప్రసాద్‌, ఎసిపి2 ఎల్‌.సుబ్బారావు, వైసిపి పట్టణా ధ్యక్షులు ఎం.శేషాచలం, ఈరే మినిస్ట్రీస్‌ అధినేత బిషప్‌ సుధీర్‌కుమార్‌, ఎంఈవో-2 జయంతిబాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి దుగ్గిరాల : మండల కేంద్రమైన దుగ్గిరాలలోని బాలికల హైస్కూల్‌ నుండి సుగాలి కాలనీ వైపు కొమ్ముమూరు కాల్వపై రూ.70 లక్షల సొంత నిధులతో నిర్మించిన ఫుట్‌ బ్రిడ్జిని కాంటినెంటల్‌ కాఫీ ఫ్యాక్టరీ చైర్మన్‌ చల్లా రాజేంద్రప్రసాద్‌ ప్రారంభించారు. తమ ఫ్యాక్టరీలో పనిచేసే వంద కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తున్నారని, అందువలన దుగ్గిరాల తమ సంస్థలో భాగంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎం.హనుమంతరావు, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జి.చిరంజీవి, సర్పంచ్‌ బాణావత్‌ ఖుషీభారు మాట్లాడారు. ఎంపిపి డి.సంతోష రూపవాణి, జెడ్‌పిటిసి ఎం.అరుణ యార్డు చైర్మన్‌ షేక్‌ బాజీ, కంపెనీ మేనేజర్‌ ఎం.బలరాం వైసిపి నాయకులు బి.వెంకటేశ్వర నాయక్‌, షేక్‌ జానీబాష, ఐ.రమేష్‌, పి.మేరమ్మ దోస్త్‌ సభ్యులు ఎం.గాంధీ, జి.శ్రీనివాస్‌, జల వనరుల శాఖ డిఇ ఎన్‌కెవి ప్రసాద్‌, వనిత పాల్గొన్నారు.

➡️