తెరుచుకొని అంగన్వాడీ కేంద్రాలు

Jan 24,2024 21:28

ప్రజాశక్తి – భోగాపురం : మండలంలోని సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో సకాలంలో అంగన్వాడి కేంద్రాలు బుధవారం తెరుచుకోలేదు. రెండు కేంద్రాలు ఏకంగా సాయంత్రం వరకు తెరుచుకోకపోవడం విశేషం. సచివాలయ సిబ్బంది సకాలంలో తాళాలు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మండలంలో 90 అంగన్వాడి కేంద్రాలు ఉండగా కార్యకర్తలు ఎప్పటిలాగే ఉదయం 9 గంటలకు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కానీ సచివాలయ సిబ్బంది సుమారు 11 గంటల తర్వాత కేంద్రాల వద్దకు వచ్చి తాళాలు ఇచ్చారు. అంతవరకు చిన్నారులతో కలిసి కేంద్రం బయటనే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ముందు రోజే సమ్మె విరమిస్తున్నట్లు సమాచారం తెలిసినప్పటికీ అధికారులు కూడా పట్టించుకోకపోవడం విశేషం. మండలంలోని చిన కౌలువాడ అంగన్వాడి కేంద్రం తాళాలు ఇవ్వకపోవడంతో సాయంత్రం వరకు తెరుచుకోలేదు. ముంజేరు -2 అంగన్వాడి కేంద్రం తాళాలు సాయంత్రం 5 గంటలకు అందజేశారు. సచివాలయ సిబ్బంది సమయానికి వచ్చి తాళాలు ఇవ్వకపోవడంతో అంగన్వాడి కార్యకర్తలు పిల్లలు ఇబ్బందులు పడ్డారు.అంగన్వాడీలకు తాళాలు ఇవ్వకపోవడం అన్యాయంపూసపాటిరేగ: సమ్మె విరమించి జాయినింగ్‌ లెటర్‌ ఇచ్చి బుధవారం నుండి అంగన్వాడీలు తెరవడానికి వెలితే తాళాలు ఇవ్వకపోవడం అన్యాయమని సిఐటియు నాయకులు బచ్చల సూర్యనారాయణ అన్నారు. మండలంలోని అంగన్వాడీలంతా తాళాలు లేక ఆరుబయటే పిల్లల్ని పెట్టుకొని కూర్చొవాల్సి వచ్చిందన్నారు. తాళాలు అడిగితే జాయినింగ్‌ లెటర్‌ ఇవ్వాలని సచివాలయ ఉద్యొగులు కోరడం ఘోరమన్నారు. మండలంలోని కందివలస, అల్లాడపాలెం సెంటర్‌లకు సంబందించి బాలామృతం ప్యాకెట్లును రోడ్డుమీద విసిరేసి కాంట్రాక్టర్‌లు వెల్లిపోవడం సరికాదన్నారు. అంగన్వాడీలపై కక్ష సాదింపు చర్యలు చేపడుతున్నట్లు ఉందన్నారు. దీనిపై అధికార్లు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️