త్వరితగతిన వంద పడకల ఆసుపత్రి పూర్తి

Mar 14,2024 21:52

ప్రజాశక్తి – సాలూరు : పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర కోరారు. గురువారం ఆయన వందపడకల ఆసుపత్రి నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. కాంట్రాక్టరు ఆసుపత్రి నిర్మించి ఫిబ్రవరి నాటికి అప్పగిస్తామని చెప్పినట్లు తెలిపారు. అయితే ఇంకా చివరి దశ పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆసుపత్రిని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం వుందన్నారు. ఏరియా ఆసుపత్రి కావడంతో నిపుణులైన వైద్యులు వున్నారని చెప్పారు. అవుట్‌ పేషెంట్‌ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. రోజూ 350 నుంచి 400 వరకు ఆసుపత్రికి రోగులు వైద్యం కోసం వస్తున్నారని చెప్పారు. ఇన్‌ పేషెంట్‌ సంఖ్య కూడా పెరిగిందన్నారు. అయితే వసతి సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. ఆసుపత్రి ప్రాధాన్యత దృష్ట్యా అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, దీని గురించి సంబంధిత వైద్య ఆరోగ్య మంత్రి , సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి లతో మాట్లాడతానని చెప్పారు.సిఆర్‌ఎం యంత్రాన్ని ప్రారంభించిన రాజన్నదొర ఆసుపత్రిలో ఎముకల వైద్య సేవలకు సంబంధించిన సిఆర్‌ఎం యంత్రాన్ని రాజన్నదొర ప్రారంభించారు. ఎముకలకు సంబంధించిన శస్త్ర చికిత్సలకు ఉపయోగపడే ఈ యంత్రం సుమారు రూ.15లక్షల విలువ చేసేదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నకుమారి చెప్పారు. దీన్ని ఉపయోగించి రోగులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లల ఆరోగ్యం, ఆహారం పట్ల సంబంధిత వార్డెన్లు, హెచ్‌ఎంలే బాధ్యత వహించాలని కోరారు. పిల్లల కోసం ఇళ్ల నుంచి వారి తల్లిదండ్రులు తీసుకొచ్చే ఆహారాన్ని హెచ్‌ఎం, వార్డెన్లు తనిఖీ చేసిన తర్వాత పిల్లలకు అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి, కౌన్సిలర్లు రాపాక మాధవరావు గొర్లి వెంకటరమణ, జి.నాగేశ్వరరావు, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గొర్లి జగన్మోహన్‌రావు, అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జర్జాపు ఈశ్వరరావు పాల్గొన్నారు.

➡️