దగ్గర్లో ఆస్పత్రి.. దూరంగా వైద్యం..

Mar 31,2024 21:40

ప్రజాశక్తి – చిలకలూరిపేట : పరికరాలున్నా సరిగా పనిచేయవు.. అవసరమైన మందులన్నీ ఉండవు.. వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరు వెరసి సామాన్యులకు ఉచిత వైద్య సేవలు దూరమవుతున్నాయి. అందుబాటులో ప్రభుత్వాస్పత్రి ఉన్నా వైద్యం దక్కడం లేదు.
నియోజకవర్గ కేంద్రం, మున్సిపాల్టీ అయిన చిలకలూరిపేటలో ఒక ఏరియా ఆస్పత్రి, ఆరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు (యుహెచ్‌సి) ఉన్నాయి. దీంతోపాటు మండలంలోని కావూరులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సి) ఉంది. ఈ ఆస్పత్రులకు ఎక్స్‌రే, రక్త పరీక్షలు, ఇతర రోగ నిర్ధారణకు సంబంధించిన వైద్యప రికరాలు సమకూర్చారు. ఏరియా ఆస్పత్రికి ప్రతిరోజూ ఓపీ 80-130 ఉండగా ఇతర ఆస్పత్రుల్లో 30-40 వరకూ ఉంటోంది. వీరితోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు 2500 మంది వరకూ ఉన్నారు. వారు కూడా వివిధ సందర్భాల్లో ప్రభుత్వాస్పత్రులకే పరీక్షలు, వైద్యం కోసం వస్తుంటారు. పట్టణంలోని కొన్ని ఆస్పత్రుల్లో ఎక్స్‌రే పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో రోగులు బయటకు వెళ్లి తీయించుకోవాల్సి వస్తోంది. ముఖ్యమైన కొన్ని మందులు కూడా బయట కొనుక్కోవాలని రాసివ్వడంతో పేదలకు ఆర్థిక భారం తప్పడం లేదు. రాత్రివేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండాలనే నిబంధనా అమలు కావడం లేదు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఆస్పత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండాలి. ఆ తర్వాత 9 గంటల వరకూ ఫోన్‌కు అందుబాటులో ఉండాల్సి ఉంది. అవసరమైతే ఆ సమయంలో ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. 100 పడకలున్న ఏరియా ఆస్పత్రిలో రాత్రి వేళల్లో ఒక నర్సు, వైద్యులు విధుల్లో ఉండాలనే నిబంధనా అమలు కావడం లేదు. దీంతో చాలామంది సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గర్భిణులకు రాత్రివేళల్లో పురిటి నొప్పులు వస్తే ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి.
మరోవైపు ఆస్పత్రులకు సరైన రక్షణ వ్యవస్థ కరువైంది. అగ్ని మాపక పరికరాలు సరిగా పని చేయడం లేదు. సిసి కెమెరాలు ఉన్నా అవికూడా పని చేయడం లేదు. వీటి కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఆస్పత్రులకు వాచ్‌మెన్‌ల పోస్టులు మంజూరైనా వారినీ నియమించలేదు. 100 పడకల ఆస్పత్రికి ముగ్గురు వాచ్‌మెన్లను నియమించాల్సి ఉన్నా అదీలేదు. ప్రజారోగ్యానికి కీలకమైన ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయాలని, పేదలకు ఉచిత వైద్యసేవలను విస్తృతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

➡️