దున్నపోతుకు వినతి

Jan 1,2024 20:46

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ప్రజారోగ్య ఇంజనీరింగ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య, ఇంజనీరింగ్‌, వాటర్‌ సెక్షన్‌ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి ఏడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య, ఇంజనీరింగ్‌ కార్మికులు సమ్మె శిబిరం వద్ద దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి వినూత్నంగా నినాదాలు ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ సమ్మె చేపట్టి ఏడు రోజులైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని, కార్మికుల సమస్యలు మీకు పట్టవా అని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌, ఆప్కాస్‌ విధాన కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని, ఇంజినీరింగ్‌ వర్కర్లందరికీ హెల్త్‌ అలవెన్స్‌ రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు చీపురుపల్లి సింహాచలం, పడాల గాంధీ, మామిడి శివ, బంగారు రాజేషు, గుంట్రెడ్డి గంగయ్యలు, తాడ్డి వినరు, వంగపండు అప్పలనాయుడు, మేడిశెట్టి కృష్ణ, అరసాడ తాతబాబు, నాగవంశం మల్లేసు, బంగారు రవి, నిర్మల ఇప్పలమ్మ, పాపులమ్మ, పడాల సంతు, వెంకన్న, సాయి, రవి, సత్తిరాజు, పలువురు కార్మికులు పాల్గొన్నారు.సాలూరు: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె ఏడో రోజు కి చేరింది. సోమవారం నిరసన శిబిరం వద్ద మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పట్టణ అధ్యక్షుడు టి.రాముడు, కార్యదర్శి టి.శంకరరావు ఆధ్వర్యాన కార్మికులు చేతులను తాళ్లతో కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు మాట్లాడుతూ ఏడు రోజులుగా మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. త్వరలో తాగునీటి సరఫరా, విద్యుత్‌ విభాగాల సిబ్బంది కూడా సమ్మెకు దిగనున్నారని, దీనివల్ల తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు పోలరాజు, స్వప్న రవి పాల్గొన్నారు.పాలకొండ : ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌, సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె సోమవారానికి ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలో కరపత్రం ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరపత్రాలు పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాలా రమణారావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పడాల భాస్కరరావు, చింతల సంజీవి, పడాల వేణు తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకొని మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పాలకవర్గాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో, అసెంబ్లీ సాక్షిగా జగన్‌ అన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చింతల సురేష్‌, శ్రీదేవి, విమల, మధు, రామరాజు, ఎన్‌ సాయికుమార్‌, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

➡️