ధర్నాకు వెళ్లారనిఆశా వర్కర్లపై వైద్యాధికారుల ఆగ్రహం

Dec 16,2023 21:06

 ప్రజాశక్తి – బలిజిపేట  :  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న ఆశా వర్కర్లపై వైద్యాధికారి, సీనియర్‌ అసిస్టెంట్‌, హెచ్‌విలు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిష్కారానికై ఈనెల 14,15 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద తలపెట్టిన 36 గంటల ధర్నాకు ఆశా కార్యకర్తలు వెళ్లినందుకు వైద్యాధికారులు వీరిపై విరుచుకుపడ్డారు. ఈ సంఘటనను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు ఖండించారు. ఆశా వర్కర్లను వైద్యాధికారులు భయాందోళనలకు గురి చేయడం పద్ధతి కాదన్నారు. ఆశాల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే వారి సమస్యల పరిష్కారానికి సహకరించాలి తప్ప ఇలా భయాందోళనకు గురి చేయడం పద్ధతి కాదన్నారు. జిల్లాలో అన్ని పిహెచ్‌సిల పరిధిలోని ఆశా వర్కర్లు ఆయా వైద్యాధికారులకు ముందుగానే ధర్నా నోటీసులు అందజేసినప్పటికీ ఇక్కడి వైద్యాధికారి అంగీకరించలేదని, పైగా ఎవరైనా తనకు చెప్పకుండా వెళ్తే వారిపై చర్యలు తీసుకుంటానని వైద్యాధికారి కిరణ్మయి, హెచ్‌వి భయ పెట్టారని తెలిపారు. ముఖ్యంగా హెచ్‌వి తన పై అధికారి ఉన్నప్పటికీ తానే ఆధిపత్యం వహించి అంతా తానై ఆశా కార్యకర్తలపై నోరు జారడం, అలాగే సీనియర్‌ అసిస్టెంట్‌ రాజశేఖర్‌ కూడా పై అధికారి మాటలను పక్కనపెట్టి తానే పైఅధికారిగా వ్యవహరించి ఆశా కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. తక్షణమే వారితో క్షమాపణ చెప్పించాలని, లేకుంటే మానవ హక్కుల ఉల్లంఘనేనని ఆయన అన్నారు.

➡️