ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం సాదాసీదాగా జరిగింది. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా మరోసారి పెనుగొండ కేశవరావు ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తలుగా గోపాలుని హరిహరరావు, సూరె సురేంద్ర, గుంటక విజయలక్ష్మి, సాదం వీరయ్య, పిన్నిక లక్ష్మి, కందుకూరి సుబ్బమ్మ, కురాటి మహాలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పెనుగొండ కేశవరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో ఎవ్వరూ చేయని విధంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రెండో విడత కూడా తనకు ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా అవకాశం కల్పిచండం మహాభాగ్యమని అన్నారు. ప్రస్తుత పదవీ కాలం ముగిసే సమయం నాటికి ఆలయంలో నలు దిక్కులా గోపురాలు నిర్మాణంతో రూ.13 కోట్ల వ్యయం కానుందన్నారు. అత్యధిక భాగం దాతల విరాళాలతో చేపట్టినట్లు చెప్పారు. ఈ వేడుకను ఆలయ కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాసరెడ్డి నిర్వహించగా ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు పాల్గొన్నారు.

➡️