నడిపాలెం చెక్‌పోస్టు వద్ద కలెక్టర్‌, ఎస్పీ తనిఖీ

Mar 27,2024 22:52

ప్రజాశక్తి – ప్రత్తిపాడు : ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు ప్రాంతమైన నియోజకవర్గలోని నడింపాలెం చెక్‌పోస్ట్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ తుషార్‌ డూడి బుధవారం తనిఖీ చేశారు. కాటూరి మెడికల్‌ కాలేజీ సమీపంలోని జాతీయ రహదారిపై చెక్‌పోస్టు వద్ద తనిఖీల సరళిని, వాహనాలను తనిఖీ చేశారు. ఏదైనా వాహనం అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలపాలని సిబ్బందికి సూచించారు. మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాము వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఎల్‌ఒ) శ్రీనివాస్‌, ఎస్‌ డిపిఒ-సౌత్‌ మహబూబ్‌ బాషా, ప్రత్తిపాడు సిఐ నిస్సార్‌ బాషా, ఎస్సై సోమేశ్వరరావు పాల్గొన్నారు.

➡️