నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సిపిఎం

Dec 7,2023 22:10 #సిపిఎం
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

కరప : వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. మండలంలోని నడకుదురు, పెనుగుదురు, కరప, వేములవాడ, వాకాడ, వలసపాకలలో గురువారం పార్టీ నాయకులు నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ మాట్లాడుతూ మండలంలో నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా కౌలు రైతులు చిన్న సన్నకారు రైతులు బాగా నష్టపోయారన్నారు. తాము పరిశీలించిన 6 గ్రామాల్లో నాలుగు దశల్లో పంట ఉందన్నారు. రైతులు ఖర్చులు భరించలేక పొలాలలోనే కుప్పలు వేసి ఉంచడంతో మోకాళ్ల లోతు నీటిలో ఉండిపోవడంతో ఒక్కొక్క కుప్పలో 15 బస్తాలు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులకు పెట్టుబడులు కలిసొచ్చే విధంగా ఉండేందుకు ఉపాధి హామీలోని కూలీలను రైతు పనులకు వినియోగించాలన్నారు. ఇప్పటికే మాసూలు చేసిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కోత కోయని వరి పొలాలను నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మురుగు కాలవలు సరిగా లేని కారణంగా వర్షపు నీరు దిగడానికి మరో వారం రోజులు పడుతుందని ఇరిగేషన్‌, డ్రైనేజీ అధికారులు మురుగునీరు దిగేందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఎపి కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు రైతులతో మాట్లాడారు. మండలంలో 14,200 ఎకరాల్లో వరి పంట సాగు చేశారని, ఇప్పటివరకు 12,800 ఎకరాల్లో కోతలు పూర్తవా సుమారు 9 వేలు మెట్రిక్‌ టన్నులు ధాన్యం మిల్లులకు చేరిందని చెప్పారు. ఇంకా పొలం గట్లపై తడిసిన ధాన్యం రాశులు ఉన్నాయని ఈ ధాన్యం రాశులను వెంటనే నిబంధనలు సడలించి మిల్లులకు పంపించాలని ఆయన కోరారు.

➡️