నాలుగో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా విడుదల

Jan 23,2024 21:04

ప్రజాశక్తి – పార్వతీపురం: వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమం ద్వారా జిల్లాలో నాలుగు విడతల్లో 378.39 కోట్లు నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి స్వయం సహాయక పొదుపు సంఘాలకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం నాలుగో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌ సమావేశమందిరంలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత నిధులు విడుదల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో కలిసి కలెక్టరు స్వయం సహాయక సంఘాలకు రూ.94.33కోట్ల రూపాయల ఆసరా నిధులు చెక్కును అందజేశారు. అనంతరం కలెక్టరు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత జిల్లాలో 16669 స్వయం సహాయక పొదుపు సంఘాలకు చెందిన 1,83,077 మంది సభ్యులు బ్యాంకు ఖాతాల్లో రూ.94.33కోట్లు సిఎం బటన్‌ నొక్కి నేరుగా జమచేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద జిల్లాకు నాలుగు విడతల్లో రూ.378.39 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన భరోసాతో పొదుపు సంఘాలు ఆర్థికంగా పరిపుష్టం కావాలని, డబ్బులను పెట్టుబడిగా పెట్టి స్వయం ఉపాధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, డిఆర్‌డిఎ పిడి పి.కిరణ్‌ కుమార్‌, లబ్దిదారులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన రుణాలను ముఖ్యమంత్రి నాలుగు విడతల్లో తిరిగి చెల్లించినందుకు ఆనందంగా ఉందని సంఘ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం తిరిగి చెల్లించిన డబ్బులతో తాము చేస్తున్న వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నామని, బ్యాంకులు ఎక్కువగా రుణాలు అందిస్తున్నాయని, వాటితో వ్యాపారం అభివృద్ధి చెంది ఆదాయం పెరిగిందని పట్టణానికి చెందిన గుంట్రెడ్డి లక్ష్మి, కర్రి ఉషారాణి, పైల సుమలత, తాటి లావణ్య, కొల్లి నాగమణి, అడ్డాపుశీలకు చెందిన సుర్ల కాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు.

➡️