నా భర్త మృతదేహాన్ని తీసుకురండి

Jan 1,2024 20:02

 ప్రజాశక్తి – జామి  :  ఉపాధి కోసం దుబారు వెళ్లి, నెల రోజులు ముగియకుందానే మృతి చెందిన తన భర్త కొత్తలి బంగారునాయుడు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని ఎమ్‌పి రామ్మోహన్‌నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయు డును మృతుడి భార్య కొత్తలి ఎర్నమ్మ కోరింది. మాజీ జెడ్‌పిటిసి బండారు పెదబాబు సాయంతో ఎర్నమ్మ ఎమ్‌పిని కలిసింది. దీనిపై స్పందించిన రామ్మోహన్‌ నాయుడు ఇమిగ్రేషన్‌ వారితో మాట్లాడి, మృతదేహాన్ని రప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఇప్పటికే ఎర్నమ్మ జిల్లా కలెక్టర్‌ని ఆశ్రయించి, తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కోరింది. గతేడాది నవంబర్‌ 29న జామి మేజరు పంచాయతీకి చెందిన కొత్తలి బంగారునాయుడు కొంతమందితో కలిసి ఉద్యోగం నిమిత్తం దుబారు వెళ్లాడు. నెల రోజులు గడవక ముందే బంగారునాయుడు మరణించడంతో ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది. కనీసం భర్తను చివరిచూపు చూసుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఎర్నమ్మ తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్‌పి రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడును తన పిల్లలతో సహా వెళ్లి కలిసి, భర్త మృతదేహాన్ని రప్పించాలని వేడుకొంది.

➡️