నూతన వేతన ఒప్పందం చేయాలి

పిటోరియా ఫార్మా (అరబిందో ఫార్మా) కార్మికుల ఛార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లను

మాట్లాడుతున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి – రణస్థలం

ఎపిటోరియా ఫార్మా (అరబిందో ఫార్మా) కార్మికుల ఛార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లను నెరవేర్చి, నూతన వేతన ఒప్పందం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పైడిభీమవరంలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అరబిందో యాజమాన్యం యూనియన్‌తో చర్చలు జరిపి కార్మికుల అంగీకారంతో వేతన ఒప్పందం చేయాలని కోరుతూ పరిశ్రమ లోపల కార్మికులు ఈనెల 28న ఉదయం ఆరు గంటల నుంచి నిరసన తెలిపారని చెప్పారు. యాజమాన్యం, కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అరబిందోఫార్మా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు)తో చర్చలు జరిపి కార్మికుల అంగీకారంతో వేతన ఒప్పందం చేయాలని, పెంచిన వేతనం అలవెన్సు రూపంలో కాకుండా బేసిక్‌లో కలపాలని డిమాండ్‌ చేశారు. అరబిందో ఫార్మా యాజమాన్యం 2021లో మూడేళ్ల కాలపరిమితితో ఏకపక్షంగా ప్రకటించిన వేతనాల కాలపరిమితి 2024 మార్చితో ముగిసిందని తెలిపారు. నూతన వేతన ఒప్పందం కోసం అరబిందో ఫార్మావర్కర్స్‌ యూనియన్‌ యాజమాన్యానికి నోటీసు ఇచ్చిందని తెలిపారు. పెరిగిన ధరలతో కార్మికుల జీవనం కష్టంగా మారిందన్నారు. కంపెనీలో ఐదేళ్ల సర్వీసు దాటిన కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి కార్మికునికి అటెండెన్స్‌ బోనస్‌ రెండు సెలవులను అనుమతిస్తూ నెలకు రూ.వెయ్యి ఇవ్వాలని, సి షిఫ్ట్‌ అలవెన్సు రూ.50 ఇవ్వాలన్నారు. కార్మికులకు బస్సు సౌకర్యం కల్పించాలని, బస్సు సౌకర్యం లేని వారికి నెలకు రూ.1500 టిఎ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బోనస్‌ ఒక నెల గ్రాస్‌ వేతనం ఇవ్వాలని కోరారు. పరిశ్రమలో పనిచేస్తూ కిడ్నీ, కేర్సర్‌, పక్షవాతం తదితర వ్యాధుల బారిన పడిన కార్మికులకు యాజమాన్యం ప్రకటించిన రూ.ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

➡️