నిబంధనలు పక్కాగా అమలు చేయాలి

ప్రజాశక్తి – కడప రానున్న సాధారణ, పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధలను పక్కాగా అమలు చేయలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజరు రామరాజు ఎంసిసి టాస్క్‌ ఫోర్స్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో త్వరలో జరగనున్న సాధారణ, పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో భాగంగా ఎంసిసి అమలుపై టాస్క్‌ ఫోర్స్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు జెసి గణేష్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో జిల్లాలో జరిగిన ఎన్నికల విజయవంతానికి ఏ విధంగా కషి చేశారో అదే స్ఫూర్తితో ప్రస్తుతం జరిగే ఎన్నికలను కూడా పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు కషి చేయాలన్నారు. నిర్దేశించిన తేదీల్లో ఎన్నికల నిర్వహణపై పోలింగ్‌ అధికారులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల విధుల్లో భాగంగా. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ విధులను టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు పక్కాగా అమలు చేయాలన్నారు. 324 ఆర్టికల్‌ (కాంప్లిట్‌ కంట్రోల్‌ సూపర్విజన్‌) ప్రకారం మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసిసి)ను అమలు చేస్తున్నామని తెలిపారు. ఐపిసి సెక్షన్‌ 123 ద్వారా ఓటర్లను మభ్య పెట్టే ఎలాంటి చర్యలనైనా ఎంసిసి నిబంధనల ఉల్లంఘన కింద పరిగణించాల్సి ఉంటుందన్నారు. డబ్బులు పంచినా, తీసుకున్నా నేరం కింద కేసు చేయవచ్చన్నారు. అలాగే లిక్కర్‌, చీరలు, ఇతర కానుకల పంపిణీ జరగకుండా చూడాలన్నారు. పార్టీలకు సంబంధించిన లోగోలు, జెండాలు, బ్యానర్లు అనుమతి లేకుండా ప్రదర్శించడానికి వీలులేదన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ప్రచార సమయం, పబ్లిసిటీ లౌడ్‌ స్పీకర్లకు అనుమతులునివ్వాల్సి ఉంటుందన్నారు. ఎక్కడా కూడా రాజకీయ ప్రభావాన్ని చూపే వ్యక్తుల విగ్రహాలు బహిర్గతం కాకుండా.. మూసివేయాలన్నారు. ఫ్లెక్షి ప్రింటర్స్‌ వివరాలు లేకుండా ప్రచార బ్యానర్లు ముద్రిస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సీజర్‌ మేనేజ్మెంట్‌ పై అవగాహన పెంచుకుని ఎన్నికల నిర్వహణ నియమావళిని పక్కాగా పాటించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలను తొలగించాలని, రాజకీయ నేతల విగ్రహాలను కప్పి ఉంచాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగానే.. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉంటుందని ప్రభుత్వ అధికారులందరూ ఎన్నికల నియ మావళిని తప్పక పాటించాలని ఆదేశించారు. ముఖ్యంగా రిలీజియస్‌ (ఆల యాలు, మజీద్‌లు, చర్చీలు) ప్రాంతాల్లో ఎలాంటి రాజకీయ సమావేశాలకు తావివ్వకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక సూచనల మేరకు ఎన్నికల మోడల్‌ కోడ్‌ నియమావళిని తూచా తప్పక అందరూ పాటిస్తూనే, మున్సిపాలిటీల్లో, మండలాల్లో ప్రజలకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణలో ఏ మాత్రం కొరత రాకూడదని హెచ్చరించారు. ఫ్లెక్సీ ప్రింటర్స్‌, లోకల్‌ మీడియా పర్సన్స్‌తో, స్థానిక పొలిటికల్‌ పర్సన్స్‌లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ అమలు, నిబంధనలపై తెలియజేయాలన్నారు. అంతకుముందు కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, టాస్క్‌ ఫోర్స్‌ అధికారులకు ఎంసిసి నిబంధనలు, విధివిధానాలపై క్షుణ్ణంగా వివరించారు. సమావేశంలో జడ్‌పిటి సిఇఒసుధాకర్‌ రెడ్డి, ఎంసిసి నోడల్‌ అధికారి నందన్‌, జిల్లా మాస్టర్‌ ట్రైనర్‌ మెప్మా పిడి సురేష్‌రెడ్డి, ఎంసిసి టాస్క్‌ ఫోర్స్‌ అధికారులైన మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు హాజరయ్యారు.

➡️