నియంతత్వ పాలనకు చరమగీతం..

Jan 31,2024 21:29
మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ

మాట్లాడుతున్న మాజీమంత్రి నారాయణ
నియంతత్వ పాలనకు చరమగీతం..
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ: వైసీపీ నియంతత్వపాలనతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని 51వ డివిజన్‌లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితో కలిసి బుధవారం ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ మాట్లాడుతూ జనరల్‌గా నేత ప్రజల వద్దకు వెళ్లి నమస్కారం పెట్టి ఓటును అభ్యర్థిస్తారని, కానీ నెల్లూరు నగర నియోజకవర్గపరిధిలో అలా లేదని, బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తాము ప్రజల వద్దకు వెళుతుంటే వారే తమ వద్దకు వచ్చి భరోసా ఇస్తున్నారన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీయే వస్తుందని, మిమ్మల్ని గెలిపించుకుంటామని మాకే ధైర్యం చెబుతున్నారన్నారు. నగర నియోజకవర్గపరిధిలో వైసీపీ నేతల అరాచకాలు, వారి ఒత్తిడితో అధికారుల తీరు ఘోరంగా ఉందని తెలిపారు. వ్యాపారాలు, దుకాణాలు నిర్వహించుకోవాలంటేనే వారి వల్ల ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దౌర్భాగ్యమన్నారు. స్వేఛ్చాయుత వాతావరణంలో పరిపాలన సాగాలే గానీ అరాచకపాలన కొనసాగించాలనుకుంటే ప్రజలు సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారని చురకలంటించారు. వైసీపీ నియంతత్వపాలనతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ఈ సమయంలో గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ… చంద్రబాబు పరిపాలనే మేలని అనుకుంటున్నారని చెప్పారు. అనంతరం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ బాబుష్యూరిటీీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నగరంలో పర్యటిస్తున్నప్పుడు అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి వస్తుందన్నారు. టీడీపీ హయాంలో నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో అనునిత్యం ప్రజల కోసం కష్టపడ్డారన్నారు.కార్యక్రమంలో ధర్మవరపు సుబ్బారావు, విజేత రెడ్డి, ప్రశాంత్‌, వాసు, ప్రశాంత్‌, ఖయ్యుమ్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️