నిరంతర సాధనతోనే విజయసోపానం

Mar 5,2024 21:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్న తపనతో నిరంతరం శ్రమించడం ద్వారానే విజయ సోపానాలు చేరుకోవచ్చని ప్రముఖ రచయిత, మనస్తత్వవేత్త యండమూరి వీరేంద్రనాథ్‌ అన్నారు. మంగళవారం ఆనందగజపతి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ విద్యా కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి రూపొందించి ఆధ్వర్యాన జరిగిన ఈ సదస్సులో యండమూరి వీరేంద్రనాథ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావ్వాలో సోదాహరణగా వివరించారు. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి, పోటీ పరీక్షలను తట్టుకొని విజేతగా నిలవడానికి తనదైన శైలిలో అవగాహన కల్పించారు. శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ జీవిత విజయాలకు సోపానాలని అన్నారు. జీవితంలో 10వ తరగతి అత్యంత ప్రధానమైనదని అన్నారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు పదవ తరగతి మార్కులే ప్రామాణికమని అన్నారు. అధిక మార్కులు సాధించడానికి సలహాలు, సూచనలు చేశారు. తల్లిదండ్రుల ఆశయాలను ఆకాంక్షలను అనుగుణంగా బాగా చదువుకుని జీవితంలో పైకి ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, విద్యా కమిటీ సభ్యులు బాలి పద్మావతి, తాళ్లపూడి సంతోషి కుమారి, తొగురోతు సంధ్యారాణి, ఎంఇఒలు రాజు, సత్యవతి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️