నిరవధిక సమ్మె దిశగా ఆశాలు

Dec 15,2023 23:23
శ్రామిక మహిళల

ప్రజాశక్తి – కాకినాడ

తమ న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు వెనకాడేది లేదని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.బేబిరాణి హెచ్చరించారు. ఆశా వర్కర్ల చేపట్టిన 36 గంటల ధర్నా కార్యక్రమంలో భాగంగా రెండోరోజైన శుక్రవారం ధర్నా శిబిరాన్ని బేబిరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత పేరుతో జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మినహా మహిళలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కరోనా సమయంలో ఆశా కార్యకర్తల చేత గొడ్డు చాకిరీ చేయిం చుకుని వేతనాలు పెంచమనేసరికి జగన్‌ ప్రభుత్వం మొహం చాటే స్తుందన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జనసేన రూరల్‌ నాయకులు పంతం నానాజీ, కాకినాడ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆశాల శిబిరంలో మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు, అన్ని సామాజిక తరగతుల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభు త్వం మారగానే ఆశాల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రామిక మహిళల పట్ల జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఆందోళన శిబిరానికి వైద్య ఆరోగ్యశాఖ డిఎంహెచ్‌ఓ శ్రీనివాస నాయకర్‌ విచ్చేసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్వీకరించారు. జిల్లాలో పరిష్కారం అయ్యే సమస్యలన్నింటిని పరిష్కారం చేస్తానని, మిగిలిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికై తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ శిబిరాన్ని సిపిఎం జిల్లా కన్వీనర్‌ మోర్తా రాజశేఖర్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ నరాల శివ, కృష్ణమోహన్‌, మేడిశెట్టి మోహన్‌, ఎన్‌జిఒ నేత బొజ్జా ఐశ్వర్య, ఆంధ్రప్రదేశ్‌ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, ఐద్వా జిల్లా నాయకురాలు జ్యోతి, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి, దళిత ఉద్యమ నాయకులు ఐయితాబత్తుల రామేశ్వరరావు మద్దతుగా మాట్లాడారు.

➡️