నిరసనల హోరు.. నేతలు బేజారు..!

‘క్యాలెండర్‌ మారిందిగాని కష్టాలు మాత్రం తీరలేదంటున్నారు జిల్లాలోని వివిధ తరగతుల ప్రజలు. కొత్త ఏడాదొచ్చి వారం రోజులవుతోంది. అయితే తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనబాటలో ఉన్న చిరుద్యోగులు ఏమాత్రమూ వెనుకంజ వేయకుండా పోరాటాల సంవత్సరమా అనేటట్లుగా వివిధ రూపాల్లో నిరసనలు సాగిస్తున్నారు. ఓపక్క ఎన్నికలు.. మరోపక్క ఆందోళనల నడుమ.. భవిష్యత్తు ఏమిటా అని అధికార పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతుండగా, వీటిని ఎలాగైనా తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. జిల్లాలో అంగన్వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెలో భాగంగా వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తుండగా ఉపాధ్యాయులు సైతం దశలవారీ ఆందోళన చేపడుతున్నారు. అందరి మాట.. అందరి డిమాండ్‌ ఒక్కటే ‘మీరిచ్చిన హామీలు అమలు చేయండి.. మేం చేసిన పనికి సంబంధించి బకాయిలు ఇవ్వండి’.. అయితే ఇవేమీ పట్టని ప్రభుత్వం నిర్బంధానికి పూనుకుని అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై జిల్లాలోని అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు మార్చుకుని తమ సమస్యలు పరిష్కరించకుంటే ‘మా సమ్మెపై ప్రభుత్వ నిషేధం కాదు.. త్వరలోనే ఈ ప్రభుత్వాన్నే మేం నిషేధిస్తాం’ అంటూ చేస్తున్న నినాదాలు అధికార పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయి. ఇక మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం పోటీ కార్మికులను రంగంలోకి దింపగా ఎక్కడికక్కడ అడ్డుకుని వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో మున్సిపల్‌ అధికారులు పోలీసులను రంగంలోకి దింపి మున్సిపల్‌ కార్మికులను అరెస్టు చేయించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు ఎస్‌పీడీ శ్రీనివాసరావు వ్యాఖ్యలతో రగిలిపోతున్నారు. ఇక యుటిఎఫ్‌ వినూత్నంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ చేపట్టిన దశలవారీ పోరు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతోపాటు చిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్డెక్కడం అధికార పార్టీ నేతలను కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీల సమస్యలు కచ్ఛితంగా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రులే బుజ్జగించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఇదే క్రమంలో వివిధ తరగతుల ప్రజల్లో వైసిపి ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తిని ఈ ఆందోళనలు ప్రతిబింబిస్తున్నాయని, తమ జోరు పెంచేందుకు ఇవి కచ్ఛితంగా ఉపకరిస్తాయని ప్రతిపక్ష టిడిపి నేతలు హుషారుగా కదులుతున్నారు. ఆచంటలో ‘రా.. కదిలిరా’ పేరిట నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్దసంఖ్యలో జనాన్ని తరలించేందుకు సమాయత్తమయ్యారు. అయితే ఆ పార్టీలోనూ ఇప్పటికీ సీట్ల కేటాయింపుపై స్పష్టత లేకపోవడం పెద్ద లోటుగా కన్పిస్తోంది. ఓపక్క జనసేనతో పొత్తు, మరోపక్క బలమైన నియోజకవర్గాల్లో గ్రూపు విబేధాలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆచంటలో నిర్వహించే సభలో తెలుగుతమ్ముళ్లకు చంద్రబాబు ఏమైనా సానుకూల సంకేతాలిస్తారేమోనని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక టిడిపితో పొత్తు ఖరారైనా జనసేన నేతల్లో మాత్రం జోరు కానరావడం లేదు. ప్రధానంగా జిల్లాలో ఏయే సీట్లు కేటాయిస్తారనే అంశం దగ్గర నుంచి పవన్‌ మళ్లీ భీమవరం నుంచి పోటీ చేస్తారా లేదా అనే మీమాంస ఆ పార్టీ నేతల్లో నెలకొంది. అదే క్రమంలో బిజెపితో పొత్తుపైనా సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. పెరిగిన ధరలు, రాష్ట్రానికి అన్యాయం వంటి అంశాలు బిజెపితో పొత్తు వల్ల తమకు ప్రతికూలమవుతాయని వారు అంతర్గత చర్చల్లో చెప్పుకోవడం విశేషం. ఇదిలా ఉండగా అధికార పార్టీ వైసిపిలో ఇదే అనిశ్చితి కొనసాగుతోంది. చింతలపూడి సీటుపై పీటముడి వీడలేదు. ఓపక్క ప్రభుత్వ అధికారి విజయరాజుకు టిక్కెట్‌ ఓకే అయ్యిందని ఆయన అనుచరులు బాణసంచా కాల్చగా.. అదేమీ లేదని మళ్లీ ఎలిజాకే టిక్కెట్‌ అని ఆయన అనుయాయులు ఘంటాపథంగా చెబుతున్నారు. పోలవరంపై స్పష్టత వచ్చినా మిగిలిన సగం సీట్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉండటం, ఎంపీ అభ్యర్థులెవరూ కానరాకపోవడం వంటి సమస్యలు అధికార పార్టీని వెంటాడుతున్నాయి. విధానాల ఫలితంగా ఏర్పడిన ప్రజావ్యతిరేకత, చిరుద్యోగుల ఆందోళనలు ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కొత్త సంవత్సరంలో వివిధ తరగతుల ఆందోళనలు అందరిలోనూ చర్చనీయాంశమవుతున్నాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

—-ఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌

➡️