నిరుద్యోగులతో ఆటలాడుతున్న ప్రభుత్వం

Feb 7,2024 22:13

ప్రజాశక్తి-సీతంపేట : నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ విమర్శించారు. డిఎస్‌సి నోటిఫికేషన్‌పై నిరుద్యోగ యువతతో సీతంపేటలో బుధవారం టిడిపి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక టిడిపి కార్యాలయం నుంచి ఐటిడిఎ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్‌సి కాదని, దగా డిఎస్‌సి అని ధ్వజమెత్తారు. ఏటా జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తామని హామీనిచ్చి, పూర్తిగా విస్మరించారని విమర్శించారు. నిరుద్యోగ యువతతో ఆటలాడుకుంటున్న సిఎం జగన్‌కి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఇంటికి పంపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సవరతోట మొఖలింగం, బిసి సెల్‌ అధ్యక్షులు ఆర్‌ రంగనాథం, ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు గంట సుధ, ఐటిడిపి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ ఇమరక పవన్‌, తెలుగు యువత అధ్యక్షులు సవర సంతోష్‌ కుమార్‌, ప్రచారకర్త తోయక సంధ్యారాణి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి నిమ్మక చంద్రశేఖర్‌, సర్పంచ్‌ బిడ్డిక నీలయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️