నిర్మాణరంగ కార్మికుల అర్ధనగ ధర్నా

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరాను పునరుద్ధరించి లక్షలాది మంది నిర్మాణరంగ కార్మికుల ఉపాధి కాపాడాలని కోరుతూ భవన నిర్మాణరంగ కార్మికుల యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ వద్ద బుధవారం అర్థనగంగా కార్మికులు ధర్నా చేశారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో రాష్ట్ర అధ్యక్షులు నారపల్లి రమణరావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ కార్మికుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఉపాధిని కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందన్నారు. రూ.1900 కోట్ల వెల్ఫేర్‌ బోర్డు నిధులను దారి మళ్లించి కార్మికులకు ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా ఇచ్చిన 1214 మెమో ఎత్తివేయాలని కోరారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సోమయ్య మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ మెటీరియల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. స్టీలు, ఐరన్‌, ఇసుక తదితర మెటీరియల్‌ ధరలు ఎన్నో రెట్లు పెరిగాయని వాపోయారు. అనంతరం కలెక్టరేట్‌లో డిఆర్‌ఒ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. ఈ ధర్నాలో జిల్లా నాయకులు చినిమిల్లి రాంబాబు, ఎసి రెడ్డి,వి.మాధవ, కెల్లా దుర్గాప్రసాద్‌, రెడ్డి లక్ష్మణరావు, సిఐటియు నాయకులు వి.సాయిబాబు, బి.జగన్నాథం పాల్గొన్నారు.

➡️