నివురుగప్పిన నిప్పులా గ్రూపు రాజకీయాలు

Mar 3,2024 21:19

ప్రజాశక్తి – సాలూరు : నియోజకవర్గ అధికారపార్టీలో అసమ్మతి, గ్రూపు రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా, రాష్ట్ర నాయకులు కింద స్థాయి కేడర్‌ సమస్యలు, యోగ క్షేమాల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మండల స్థాయిలో ఎంపిపి స్థాయి నాయకులు తప్ప జెడ్పీటీసీ, ఎంపిటిసి, సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నారు. సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత తమకు గ్రామాల్లో, పట్టణాల్లో కనీస గౌరవ మర్యాదల్లేవనే అసంతృప్తి వారిలో గూడు కట్టుకొని ఉంది. మండల, మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికల్లో వైసిపి బలపర్చిన అభ్యర్థులను ఎక్కువగా గెలిపించినా తగిన గుర్తింపు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసి పదవుల్లోకి వచ్చి మూడేళ్లయినా ప్రభుత్వం నుంచి ఎలా భరోసా రాలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయిలో ఒకరిద్దరు నాయకులు తప్ప మిగిలిన నాయకులంతా ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నామని ఎవరికి వారే చెపుతున్నారు. ఇలాంటి సమస్యలతో పాటు మండలాల్లో గ్రూపు రాజకీయాలు కూడా వున్నాయి. సాలూరు, పాచిపెంట, మెంటాడ మండలాల్లో వైసిపి నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఒక గ్రూపు నాయకులు ఔనంటే మరో గ్రూపు నాయకులు కాదనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా మండల స్థాయిలో కొంతమంది నాయకులు మితిమీరిన దందాలు, దౌర్జన్యాల కారణంగా గ్రామ స్థాయి కేడర్‌లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల సాలూరు మండలంలో తోణాం పంచాయతీ నుంచి కొంతమంది కార్యకర్తలు వైసిపిని వీడి టిడిపిలో చేరినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సిఎం రాజన్నదొర ఇంతవరకు ఆ కొద్దిమంది నాయకుల దందాలు, దౌర్జన్యాల గురించి తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికల ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ స్థానిక నాయకులు, కార్యకర్తల్లో అసమ్మతిరాగం వినిపిస్తోంది. మున్సిపాలిటీలోనూ గ్రూపు రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయి. పాలకవర్గం ఏర్పాటు నుంచి వైసిపి నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేదు. రెండున్నరేళ్లు దాటిన తర్వాత చైర్‌పర్సన్‌ మార్పునకు సంబంధించిన అంశం ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. తాజా పరిణామాలు అధికారపార్టీని వేధిస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా వాటితో ఇప్పటికిప్పుడు పార్టీకి నష్టం చేకూరే పరిస్థితి కనిపించడం లేదు. అయితే నియోజకవర్గ టిడిపిలో కూడా బలమైన నాయకత్వం లేకపోవడం, అక్కడ కూడా గ్రూపు రాజకీయాలు బలంగా ఉండడం వంటి అంశాలు అధికారపార్టీకి వరంలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసిపి నియోజకవర్గ సమావేశం సోమవారం ఉదయం 10గంటలకు జరుగనుంది. డిప్యూటీ సిఎం రాజన్నదొర అధ్యక్షతన జరగనున్న సమావేశానికి పార్టీ డిప్యూటీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. మరో నెల రోజుల్లో ఎన్నికలు ఎదుర్కోనున్న నేపథ్యంలో పార్టీ నాయకులను, కార్యకర్తలను సమాయత్తం చేయడానికి సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసే దిశగా జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కార్యాచరణ రూపొందించనున్నారు.

➡️