నిషేధిత బిటి-3 పత్తిపంట ధ్వంసం

ప్రజాశక్తి-బొబ్బిలి : రామభద్రపురం మండలంలోని కోటశిర్లాంలో సాగు చేస్తున్న బిటి-3 పత్తి సాగును వ్యవసాయ శాఖాధికారులు ధ్వంసం చేశారు. పర్యావరణానికి హాని కలిగించే బిటి-3 పత్తి సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినప్పటికి గుంటూరు ప్రాంతానికి చెందిన మాఫియా బిటి-3 పత్తి విత్తనాలు, పంట సాగుకు పెట్టుబడులు ఇచ్చి రైతులకు జరిగే నష్టాన్ని చెప్పకుండా సాగు చేయిస్తోంది. నిషేధిత బిటి-3 పత్తి సాగు చేస్తున్నట్లు తెలియడంతో కోటశిర్లాం, కొండకెంగువ, పాడివానివలస గ్రామాల్లో ‘ప్రజాశక్తి’ పర్యటించింది. బిటి-3 పత్తి సాగును పరిశీలించి జరిగే నష్టంపై గత నెల 30న కథనాన్ని ప్రచురించడంతో వ్యవసాయ శాఖ ఎడి మజ్జి శ్యామసుందర్‌ స్పందించారు. పత్తి ఆకులను పరీక్షించగా బిటి-3 పత్తిగా నిర్దారణ కావడంతో పంటను పూర్తిగా ట్రాక్టర్‌తో దున్ని ధ్వంసం చేశారు. ఇప్పటికే పండిన పత్తిని దగ్ధం చేశారు. ఒకగదిలో నిల్వ చేసిన పత్తిని సీజ్‌ చేశారు. నిషేధిత పత్తి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎడి శ్యామసుందర్‌ హెచ్చరించారు. ఆయనతో వ్యవసాయ శాఖాధికారులు ఉన్నారు.

➡️