నులిపురుగుల నివారణతో ఆరోగ్యానికి రక్ష

Feb 9,2024 20:53

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం  : నులి పరుగుల నివారణ ఆరోగ్యానికి రక్షణ అని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జిల్లాలో పెద్ద ఎత్తున శుక్ర వారం నిర్వహించారు. మండలంలోని బాలేసు పాఠశాలలో నులిపురుగుల నివారణ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నులిపురుగుల వల్ల రక్త హీనత, పోషకాలు లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. ఆల్‌ బెండజోల్‌ మాత్ర వేయడం ద్వారా రక్త హీనత నివారణ, పోషకాలు గ్రహించడం జరుగుతుందని తద్వారా ఏకాగ్రత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 1 నుండి ఐదేళ్ల చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లోనూ, 6 నుండి 19 ఏళ్ల విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలలో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.16న మాప్‌ అప్‌ఈనెల 16న మాప్‌ అప్‌ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు. శుక్రవారం వివిధ కారణాల రీత్యా మాత్రలు వేసుకోని వారిని గుర్తించి ఈనెల 16న జరిగే మాప్‌ అప్‌ కార్యక్రమంలో వేయిస్తామన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌మండలంలోని దుడ్డుకల్లు, బాలేసు, భద్రగిరి గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ పరిశీలించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్‌, తాగునీరు, మరుగు దొడ్లు, ర్యాంపు సౌకర్యాలు ఉండాలని, పోలింగ్‌ నిర్వహణకు అనుకూలత ఉండాలని స్పష్టం చేశారు. వసతుల కొరత ఉండరాదని చెప్పారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అన్ని వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాల తనిఖీభద్రగిరిలో అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. అంగన్వాడీ చిన్నారుల అభ్యసన తీరును గమనించారు. చిన్నారుల బరువు, ఎత్తు స్వయంగా పరిశీలించారు. పిల్లల బరువు, ఎత్తు, అభ్యసన స్థాయి నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని అందుకు తగిన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గర్భిణులకు ఇంటింటికీ రేషన్‌ పంపిణీ (టేక్‌ హౌమ్‌ రేషన్‌) అందించడమే కాకుండా ఆయా గర్భిణీలు మాత్రమే తీసుకునేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. గర్భిణికి అందించిన పౌష్ఠిక ఆహారం కుటుంబ సభ్యులు తీసుకోరాదని స్పష్టం చేశారు. హైరిస్క్‌ గర్భిణీలను గుర్తించి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. మండలంలో గల రక్త హీనత నివారణ కమిటీ (ఎనిమిక్‌ ఏక్షన్‌ టీమ్‌) సభ్యులుగా ఉన్న ఎఎన్‌ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్త, మహిళా పోలీస్‌ తమ పరిధిలో ఉన్న రక్త హీనత కలిగిన చిన్నారులు, బాలింతలు, గర్భిణీలను గుర్తించాలని ఆదేశించారు. పదేళ్లలోపు వయస్సు గల పిల్లల్లో మరణాల రేటు తగ్గించేందుకు అమలు చేస్తున్న ప్రిజమ్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా చిన్నారుల్లో రక్తహీనతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా దుడ్డుకల్లు పాఠశాలలో విద్యార్థులకు తయారు చేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ఆహార పదార్థాల తయారీలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత విధిగా పాటించాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

➡️