నూర్పిడి యంత్రంలో నలిగిన బతుకులు

Dec 27,2023 21:49

 ప్రజాశక్తి-తెర్లాం  :  విజయనగరంజిల్లా తెర్లాం మండలంలోని అంట్లవార గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. వరిచేను నూర్పిడి మిషన్‌ బోల్తాపడి ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో పొలంలో వరి చేను నూర్పిడి పనికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన ఏడుగురు రైతు కూలీ మహిళలు గంటలో పని ముగించుకొని తిరిగి నూర్పిడి యంత్రాన్ని తరలిస్తున్న వాహనంపై ఎక్కి గ్రామానికి వస్తున్నారు. పొలం గట్టు ఎక్కుతుండగా మిషన్‌ బోల్తా పడడంతో కూలీలు గంటా రమణమ్మ (35), భీమసింగ్‌ శాంతి (37) అక్కడిక్కడే మృతి చెందారు. మిగతా ఐదుగురికి స్వల్ప గాయాలవ్వడంతో వెంటనే రాజాంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ ఆర్‌ రమేష్‌ చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. రమణమ్మకు భర్త ధనుంజయరావు, ఇద్దరుపిల్లలు ఉన్నారు. కుమారుడు మణికంఠ ఐటిఐ చదువుతున్నాడు. కుమార్తె హరిప్రియ 9వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. మరో మృతురాలు శాంతికి భర్త సంగమేశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ట్రిపుల్‌ఐటి చదువుతుండగా, కుమారుడు మణికంఠ 9వతరగతి చదువుతున్నాడు.

➡️