నేటి నుంచి ఎంఎస్‌ఎంఇల నమోదు సర్వే

Mar 1,2024 20:44

 ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్రంలోని అన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నమోదు కోసం మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్వే చేపట్టిందని, జిల్లాలోని అన్ని ఎంఎస్‌ఎంఇలు ఈ సర్వేలో నమోదు కావాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి కోరారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పనితీరును మెరుగుపరచడం, వాటి అభివృద్ధి కోసం ప్రపంచబ్యాంకు ఆర్థిక సహకారంతో కేంద్రప్రభుత్వం చేపట్టిన ర్యాంప్‌ పథకంలో భాగంగా పరిశ్రమల నమోదును చేపడు తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ సహాయకులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఎమినీటి సెక్రటరీలు ఆయా సంస్థలకు సర్వే నిమిత్తం వచ్చినపుడు ఆయా పరిశ్రమల యాజమాన్యాలు తగు సమాచారం ఇవ్వడం ద్వారా సర్వేకు సహకరించాలని తెలిపారు. సర్వేకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు.తయారీ, సేవా, వాణిజ్య రంగాల్లోని అన్ని ఎం.ఎస్‌.ఎం.ఇ.లను సర్వేచేసి వాటిని డిజిటల్‌ ప్లాట్‌ఫాం లోకి తీసుకురావడం ద్వారా ఎపి ఎంఎస్‌ఎంఇ పోర్టల్‌కు అనుసంధానిస్తారని తెలిపారు. ఈ సంస్థలకు భవిష్యత్తులో బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడం, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం కోసం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కల్పించడం కోసం ఈ సమాచారాన్ని వినియోగిస్తారని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డి.ఆర్‌.ఓ. ఎస్‌.డి.అనిత, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ బి.సహాదిత్‌ వెంకట త్రివినాగ్‌, పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ పాపారావు తదితరులు పాల్గొన్నారు.

➡️