నేటి నుంచి టిడిపి ‘శంఖారావం’

Feb 12,2024 20:25

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :   టిడిపి యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన శంఖారావం యాత్ర ఉమ్మడి జిల్లాలో మంగళవారం నుంచి సాగనుంది. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ యాత్రలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లోను బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో లోకేష్‌ కీలక ప్రసంగం చేయనున్నారు. స్థానిక అపరిష్కృతంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలు, వైసిపి ఎమ్మెల్యేల వైఫల్యాలు, నెరవేరని హామీలపై ప్రసంగం చేయనున్నట్టు సమాచారం. దీనికి ముందే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్యనేతల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారని సమాచారం. లోకేష్‌తోపాటు సంబంధిత పార్లమెంటరీ పార్టీ సమన్వయ కర్త, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, స్థానిక జనసేన నాయకులు కూడా మాట్లాడతారు. సభలో ప్రజలు, లేదా పార్టీ కార్యకర్తల నుంచి వచ్చిన వినతులను కూడా స్వీకరించనున్నారు. ప్రతి సభకు 20వేల నుంచి 25వేలకు తగ్గకుండా జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఇందుకోసం ఆటోలు, వ్యాన్లు తదితర ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో శంఖారావం యాత్రకు సంబంధించి అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు అడారి శ్రావణ్‌కుమార్‌ సమన్వయం చేస్తున్నారు. ఇటు విజయనగరంలో పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు, పార్లమెంట్‌ అధ్యక్షులు కిమిడి నాగార్జున ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్టు సమాచారం. ప్రతి గ్రామం నుంచీ కేడర్‌ కదిలే విధంగా ప్రయత్నం చేయాలని పార్టీ ఆదేశించినట్టు సమాచారం. శంఖారావం పేరుతో మొదలైన ఈ యాత్రలో పార్టీ నాయకులు, కేడర్‌లోని అలకలు, అసంతృప్తులు, గ్రూపులను పసిగట్టి, అటువంటి చోట పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా తెరవెనుక వ్యూహం ఉన్నట్టుగా సమాచారం. లోకేష్‌ దృష్టిలో పడేందుకు ఆశావహులంతా సభ జరిగిన ప్రాంతాలు, రహదారుల్లో భారీ ఫ్లెక్సీ కటౌట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. నేడు పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో సభలు ఈనెల 13వ తేదీ ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సభ జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు పాలకొండలోనూ, సాయంత్రం 5గంటలకు కురుపాంలోనూ సభలు జరుగుతాయి. పాలకొండ నుంచి వీరఘట్టం వెళ్లే రోడ్డులో మార్కెట్‌యార్డుకు సమీపంలోని ఖాళీ స్థలంలోనూ, కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఎర్రన్న గుడివద్ద బహిరంగ సభలు జరనున్నాయి. సభా ప్రాంగణాలను ఇప్పటికే ఆయా నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జులు, పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పరిశీలించారు. సభా వేదికలు సిద్ధమయ్యాయి. నాయకులంతా జన సమీకరణలో నిమగమయ్యారు. ఇదీ శంఖారావం షెడ్యూల్‌ 13న పార్వతీపురం మన్యం జిల్లాలో మధ్యాహ్నం పాలకొండ, సాయంత్రం కురుపాం నియోజకవర్గాల్లో సభలు జరుగుతాయి. 14న జిల్లా పార్వతీపురం, సాలూరు, విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగిలో సభలు ఏర్పాటు చేశారు. 15న ఎచ్చెర్ల, రాజాం, చీపురుపల్లి, 16న గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల, 17న ఎస్‌.కోట నియోజకవర్గాల్లో శంఖారావం యాత్ర సాగుతుంది.

➡️