నేడు గ్రామీణ బంద్‌

Feb 15,2024 23:57

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రైతులు, కార్మికుల సమస్యలపై సంయుక్త కిసాన్‌ మోర్చ, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా శుక్రవారం గ్రామీణ బంద్‌, పారిశ్రామిక బంద్‌ జరగనుంది. ఇందులో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనూ జంద్‌ కోసం ఇప్పటికే రైతు, కార్మిక సంఘాలు గత నెల రోజులుగా విస్తృత ప్రచారం చేశాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలను మూసివేసేందుకు రైతు, కార్మిక నాయకులు సన్నద్ధమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో బంద్‌ను సంపూర్ణంగా నిర్వహించేందుకు ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని, రుణమాఫీ చేయాలని, రైతులకు పింఛన్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న రైతుల ఆందోళనకు మద్దతుగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కూడా శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరగనున్నాయి.కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా, ట్రేడ్‌ యూనియన్‌ ఐక్య వేదిక పిలుపు మేరకు శుక్రవారం రైతులు, కార్మికులు ర్యాలీలు చేపట్టనున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలతో పాటు వ్యవసాయ కార్మికులు ర్యాలీల్లో పాల్గొననున్నారు. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాలను తొలగించేందుకు రైతులను ఆదుకునేందుకు డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు అన్ని పంటలకు పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలని, ఈ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. రైతులకు రుణాలమాఫి, రుణ ఉపశమన చట్టం చేయాలని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను తొలగించాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించి ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలని తదితర డిమాండ్లతో గ్రామీణ బంద్‌ జరగనుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయరాదని, కడప ఉక్కు నిర్మించాలని, విద్యుత్‌ చట్టసవరణ బిల్లు ఉపసంహరించాలని, స్మార్టు మీటర్ల బిగింపును నిలిపివేయాలని, భూహక్కుల చట్టం ఉపసంహరించాలని, పోలవరం నిర్వాసితులకు తక్షణం పునరావసం, పరిహారం ఇవ్వాలని కిసాన్‌ మోర్చా నాయకులు పచ్చల శివాజీ, కంచుమాటి అజరుకుమార్‌, ఏపూరి గోపాలరావు, యు.రాము, సిఐటియు నాయకులు వై.నేతాజి, ఆంజనేయనాయక్‌, ఎఐయుటిసి నాయకులు హనుమంతరావు,కె.రాంబాబు డిమాండ్‌ చేశారు. వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు రైతులంతా సంఘటితం కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన మోటారు వాహన చట్టం డ్రైవర్లకు శరఘాతంగా మారిందని మోటారువాహన అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్మికులు కూడా నిరసన ప్రదర్శన చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం రవాణా కార్మికులకు తీవ్ర ఇబ్బందికరంగా రూపొందించిన ఉత్తర్వులు రద్దుచేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

➡️