నేడు జయహో బిసి రాష్ట్ర సదస్సు

Mar 5,2024 00:11

సభా వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాయకులు
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
జయహో బిసి రాష్ట్ర సదస్సు, టిడిపి, జనసేన పార్టీల బిసి డిక్లరేషన్‌ సభ నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్‌ మిషన్‌ మహా సభల ప్రాంగణంలో మంగళవారం జరగనుంది. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టిడిపి బిసి సాధికార కమిటి ఛైర్మన్‌ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, కార్యకర్తలు సదస్సులో పాల్గొననున్నారు. టిడిపి, జనసేన అధికారంలోకి వస్తే బిసిల అభ్యున్నతికి అమలు చేయనున్న పథకాలపై ఈ సభలో డిక్లరేషన్‌ ఇవ్వనున్నారు. సభకు కనీసం లక్షన్నర మందిని సమీకరించాలని జిల్లా నాయకులకు పార్టీ అగ్రనేతలు లక్ష్యాన్ని నిర్ణయించారు. బీసీల అభ్యున్నతికి నిర్దిష్ట విధానాలు, చర్యలతో ఒక సమగ్ర బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విడుదల చేస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు. విస్తృత చర్చల ఆధారంగా ఈ డిక్లరేషన్‌ను రూపొందిస్తామన్నారు. గత ఐదేళ్లలో బిసిలకు జరిగిన అన్యాయంపై సభలో నాయకులు వివరించనున్నారు. సదస్సు ప్రాంగణాన్ని అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఇదిలా ఉండగా బహిరంగ సభను జయప్రదం చేయాలని టిడిపి నాయకులు కోరారు. ఈ మేరకు పోస్టర్‌ను టిడిపి గుంటూరు తూర్పు నియోజకవర్గం కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి మొహమ్మద్‌ నసీర్‌, యర్రగొండపాలెం అభ్యర్థి యరిక్సన్‌ బాబు, దాసరి రాజా మాస్టర్‌, పోతినేని శ్రీనివాస్‌రావు, జాగర్లముడి శ్రీనివాస్‌రావు, నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు వి.శ్రీను, నియోజకవర్గం అధ్యక్షులు ఎం.మురళి పాల్గొన్నారు.

➡️