నేడు యుటిఎఫ్‌ నిరసన ప్రదర్శన

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వాన్ని నిరసిస్తూ యుటిఎఫ్‌ పిలుపు మేరకు కడప మహావీర్‌ సర్కిల్‌ నుంచి కలెక్టర్‌ వరకు ర్యాలీ నిరసన ప్రదర్శన ఈ నెల 19న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు తెలిపారు. గురువారం యుటిఎఫ్‌ భవన్‌లో ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు, ఉపాధ్యా యులకు బకాయి పడ్డ ఆర్థిక బకాయిలను సకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చి నాలుగున్నర సంవత్సరాలు పూర్తయినప్పటికీ న్యాయబద్ధమైన ఆర్థిక బకాయిల చెల్లింపు చేయకుండా ఉద్యోగుల చెవిలో పువ్వులు పెట్టారని ఆరోపించారు. దీనికి నిరసనగా చెవిలో పూలతో శుక్రవారం ఉదయం 10 గంటల కు కడప మహావీర్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ డిఇఒ కార్యాలయం మీదుగా ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన ప్రదర్శన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్‌, జిల్లా కార్యదర్శి ఏజాస్‌ అహ్మద్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, నాయకులు వెంకటసుబ్బయ్య, చంద్రశేఖర్‌, శివశంకర్‌, జావిద్‌ పాల్గొన్నారు.

➡️